Guwahati High Court | ముందస్తు బెయిల్‌కు నిరాకరణ

Guwahati High Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు గౌహతి హైకోర్టులో కూడా చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రిని భుయాన్ శర్మకు పలు దేశాల్లో పాస్‌పోర్టులు ఉన్నాయని, విదేశాల్లో ఆస్తులున్నాయని పవన్ ఖేరా మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అస్సాం క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా గౌహతి హైకోర్టును ఆశ్రయించగా, ఏప్రిల్ 21న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా జస్టిస్ పార్తివ్‌జ్యోతి సైకియా ముందస్తు బెయిల్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెల్లడించారు.

ఇంతకుముందు ఏప్రిల్ 7న ఢిల్లీలోని ఖేరా నివాసానికి అస్సాం పోలీసులు వెళ్లారు. అనంతరం ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ వారం రోజుల ఉపశమనం లభించింది. అయితే తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.