దళారి వ్యవస్థకు చెక్..

పిఎసిఎస్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం…

రాయపర్తి, ఆంధ్రప్రభ : రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి దళారి వ్యవస్థకు చెక్ పెట్టిందని జిల్లా సహకార సంఘం అధికారిణి ఎం. నీరజ అన్నారు. బుధవారం మండలంలోని రాయపర్తి, కోలనుపల్లి సహకార సంఘాల ఆధ్వర్యంలో రాయపర్తి, కొండూరు, జయరాంతండా(s), కేశవాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సహకార సంఘం అధికారిణి ఎం. నీరజ, ఏఎంసి వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్‌లతో కలిసి ప్రారంభించారు.

అనంతరం మొదటి బస్తా తూకం వేసి కొనుగోలు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోవద్దని రైతులను కోరారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. తూకంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తామని, ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ల ద్వారానే తూకం వేస్తామని తెలిపారు.

రైతులు ధాన్యంలో తేమశాతం 17% లోపు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, తాలు, మట్టి లేకుండా శుభ్రం చేసి తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నీడ కోసం షామియానాలు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉంచామని వివరించారు.రైతులకు దళారుల బెడద లేకుండా న్యాయం చేయడానికే ప్రభుత్వం ప్రతి గ్రామానికి కొనుగోలు కేంద్రాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.

కొనుగోలులో ఎక్కడైనా అవకతవకలు జరిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారిణి కనకదుర్గ, సహకార సంఘాల స్పెషల్ ఆఫీసర్లు అక్రి నాయక్, దాసురాజు, సిఇఓలు మాజీ పి ఎస్ సి ఎస్ చైర్మన్ కొండూరు రామచంద్రారెడ్డి,ఏడాకుల సోమిరెడ్డి, శ్రీపాది యాదగిరి, వ్యవసాయ శాఖ అధికారులు పసరగొండ మనస్విని, బొల్లెపల్లి కావ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు గారే సహేంద్ర బిక్షపతి, రాయిని యాకన్న, లావుడ్యా శిల్ప,గుజే సుధాకర్, ఉప సర్పంచ్‌లు, సహకార సంఘాల ప్రతినిధులు ఐత మల్లేష్, ఓరుగంటి రాకేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply