కేజీబీవీ భవన నిర్మాణ శంకుస్థాపన

నాగర్కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు నాగనూలు గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న కేజీబీవీ పాఠశాల భవనానికి ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాలను సందర్శించిన ఆయన, విద్యార్థులతో మాట్లాడి వారికి అందిస్తున్న భోజన నాణ్యతపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మంచి విద్యతోనే భవిష్యత్తు నిర్మాణం సాధ్యమవుతుందని, ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని కృషి చేస్తే విజయం సాధించవచ్చని తెలిపారు. గురువులను గౌరవిస్తూ కష్టపడి చదివితే సమాజంలో మంచి స్థానం సంపాదించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, కౌన్సిలర్లు వసంత సంతోష్ గౌడ్, నరసింహ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
