Alliance Govt | మహిళా పారిశ్రామికవేత్తలకు భారీ ప్రోత్సాహం
Alliance Govt | మహిళా పారిశ్రామికవేత్తలకు భారీ ప్రోత్సాహం
- గరిష్ఠంగా రూ.2 లక్షలు… మొత్తం రూ.3 లక్షల వరకు అవకాశం
- ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా వడ్డీలేని రుణం
- రూ.3 వేల కోట్లతో భారీ ప్రణాళిక
Alliance Govt | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మహిళలను ఆర్థికంగా బలపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టేందుకు ప్రత్యేక రుణ సదుపాయాన్ని అందించనుంది. స్త్రీనిధి ద్వారా ఒక్కో మహిళకు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు అదనపు రుణం ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే అందుతున్న రూ.1 లక్ష రుణానికి ఇది అదనంగా లభించనుండటంతో, ఒక్కో మహిళకు మొత్తం రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందే అవకాశముంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళలకు మరో రూ.1 లక్ష వరకు వడ్డీలేని రుణం కూడా ఇవ్వనున్నారు.
ఈ రుణాల కోసం ఎలాంటి ప్రాసెసింగ్ లేదా డాక్యుమెంటేషన్ ఫీజులు ఉండవు. అలాగే హామీలు అవసరం లేకుండా దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు. సాధారణ రుణాల పై సుమారు 11 శాతం వడ్డీ విధించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 1.50 లక్షల మంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందు కోసం రూ.3 వేల కోట్ల నిధులను కేటాయించనుంది.
వ్యక్తిగతంగా రుణాలు.. మరింత ప్రోత్సాహం..
రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో డ్వాక్రా సంఘాలు, కోట్లలో సభ్యులు ఉన్న నేపథ్యంలో ఈ కొత్త విధానం మహిళలకు పెద్ద ఊతంగా మారనుంది. ఇప్పటి వరకు సంఘానికి కలిపి రుణం ఇస్తుండగా, ఇప్పుడు వ్యక్తిగతంగా రుణం ఇవ్వడం ప్రత్యేకతగా మారింది. అయితే.. ఈ సదుపాయం పొందాలంటే, డ్వాక్రా సభ్యురాలిగా ఉండి గతంలో తీసుకున్న రుణాలను సమయానికి చెల్లించిన రికార్డు ఉండాలి. వ్యవసాయం అనుబంధ రంగాలు, చిన్న వ్యాపారాలు, సేవా రంగాల్లో కొత్త అవకాశాలను వినియోగించుకునేందుకు ఈ పథకం ఉపయోగపడనుంది. మొత్తానికి, మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడానికి ఈ నిర్ణయం కీలక మలుపుగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.
