మందుబాబులకు ‘అడ్డా’గా మారిన విద్యా నిలయం!

మందుబాబులకు ‘అడ్డా’గా మారిన విద్యా నిలయం!

  • మంథని ప్రభుత్వ కళాశాల మైదానంలో అసాంఘిక కార్యకలాపాలు
  • వాకింగ్ చేసేందుకు భయపడుతున్న మహిళలు..
  • నిమ్మకు నీరెత్తినట్లు పోలీసులు
  • స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే భద్రత వైఫల్యంపై సర్వత్రా విమర్శలు

మంథని, ఆంధ్రప్రభ : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యా నిలయం.. ఇప్పుడు పోకిరీలకు, మందుబాబులకు నిలయంగా మారింది. మంథని పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారి, పర్యావరణాన్ని, ప్రజా శాంతిని దెబ్బతీస్తోంది. రాత్రిపూట అక్కడ సాగే ఆగడాల వల్ల ఉదయం వాకింగ్‌కు వచ్చే వారు, క్రీడాకారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

చెల్లాచెదురుగా మద్యం సీసాలు – సిగరెట్ ప్యాకెట్లు:

పగలు విద్యార్థులతో కళకళలాడే ఈ మైదానం, సూర్యాస్తమయం కాగానే అసాంఘిక శక్తుల గుప్పిట్లోకి వెళ్తోంది. మైదానం మూలల్లో గమనిస్తే ఖాళీ మద్యం సీసాలు, తిని పారేసిన ఆహార పొట్లాలు, సిగరెట్ ముక్కలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. సరైన వెలుతురు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని పోకిరీలు ఇక్కడ విందులు నిర్వహిస్తూ, అసభ్యకరమైన ప్రవర్తనతో అటుగా వెళ్లే వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

మహిళల భద్రత ప్రశ్నార్థకం:
ఉదయం 5 గంటలకు వాకింగ్ వచ్చే మహిళలకు, రాత్రులు ఫుల్లుగా మద్యం సేవించి మద్యం మత్తులో గ్రౌండ్లోనే నిద్రిస్తున్న వారిని చూసి భయాందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వందలాది మంది మహిళలు, వృద్ధులు ఆరోగ్యం కోసం ఈ మైదానంలో వాకింగ్ చేస్తుంటారు. అయితే, మైదానంలో పడి ఉన్న మద్యం సీసాల ముక్కల వల్ల నడిచేందుకు ఇబ్బంది కలగడమే కాకుండా, పోకిరీల కదలికల వల్ల మహిళలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రక్షణ కల్పించాల్సిన మైదానంలో భయం భయం తో అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలీస్ స్టేషన్ పక్కనే ఇలాగైతే ఎలా?

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న మైదానంలోనే ఇలాంటి కార్యకలాపాలు సాగడం పోలీసుల నిఘా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. గస్తీ ముమ్మరం చేయాల్సిన పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, మైదానంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, రాత్రిపూట గస్తీని పెంచాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంథని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply