ప్రజా సమస్యలపై నిజాలు రాస్తే బెదిరింపులా?.. ఆగ్రహించిన విద్యార్థి నాయకులు

ప్రజా సమస్యలపై నిజాలు రాస్తే బెదిరింపులా?.. ఆగ్రహించిన విద్యార్థి నాయకులు

అచ్చంపేట,ఆంధ్రప్రభ: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజ సేవలో ముందుండే పాత్రికేయుడిపై దుర్భాషలు, బెదిరింపులకు దిగడం తీవ్రంగా ఖండనీయమని అచ్చంపేట విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఆంధ్రప్రభ దినపత్రిక విలేకరి కె.ఎల్. నారాయణరావు పై ఇటీవల ఫోన్లో బెదిరించడం, దుర్భాషలు అడగడం, యావత్తు పాత్రికేయ వృత్తిని తులనాడడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. వివరాల్లోకి వెళితే… అచ్చంపేట పరిధిలో జరుగుతున్న వెంచర్లపై జరిగిన అక్రమాలపై ఆంధ్రప్రభ విలేకరి నారాయణరావు వార్తా కథనం ప్రచురించగా, దానిని జీర్ణించుకోలేని కొందరు రియల్ ఎస్టేట్ వర్గాలు ఫోన్ ద్వారా దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెలువడ్డాయి.

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసే పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పని విద్యార్థి నాయకులు అభిప్రాయపడ్డారు. పాత్రికేయ వృత్తి పట్ల గౌరవం చూపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వార్తలు రాసినందుకు బెదిరింపులకు దిగడం అనేది సహించరానిదని వారు స్పష్టం చేశారు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బుక్కాపురం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్, పిడిఎస్యు నాయకుడు అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply