ఠారెత్తిస్తున్న పోలీస్ ఠాణా..

ఠారెత్తిస్తున్న పోలీస్ ఠాణా..

భయపడేలా వ్యవహరించిన పోలీస్ అధికారులు
సస్పెన్షన్ తో సరి పెడతారా?
ప్రజలకు భరోసా ఉంటుందా?

మాచర్ల, ఆంధ్రప్రభ : మాచర్ల పోలీస్ స్టేషన్ పేరు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో రాజకీయపరంగా జరిగిన దాడులు, హత్యలు అయితేనేమి ప్రస్తుతం పోలీసులు వ్యవహరించిన ఉదంతం మాచర్ల పేరు సంచలనంగా మారింది. దీనికి కారణం ఈ స్టేషన్ పరిధిలో పోలీసులు వ్యవహరించిన తీరు. న్యాయం కోసం ప్రజలందరూ వెళ్లే స్థలం పోలీస్ స్టేషన్. బాధితులకు న్యాయం చేయవలసిన పోలీస్ అధికారులే భక్షకులైతే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు నిరూపించి చూపించారు మాచర్ల పోలీస్ స్టేషన్ అధికారులు.

ఇప్పుడు మాచర్ల పట్టణ ప్రజలతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనసులో ఎన్నో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. తప్పు చేసిన అధికారులపై కేవలం సస్పెన్షన్ మాత్రమే విధించారు. సామాన్య వ్యక్తులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తాట పోలీసులు ఎలా తీస్తారో అందరికీ తెలిసిందే. సదరు స్టేషన్లో అధికారులు చేసిన పని మామూలు వ్యక్తి చేసి ఉండి ఉంటే నడిరోడ్డు మీద ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చేవారు అనేది చెప్పనవసరం లేదు.

మరి ఇప్పుడు పోలీసులు చేసిన పని ఏమిటి? ఇప్పుడు వారికి శిక్ష విధిస్తారా? బాధితులకు న్యాయం జరుగుతుందా? చట్టం తన పని తాను చేసుకుని పోతుందా? ఖాఖీల పట్ల నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ప్రజల మనసులో మెదులుతున్నాయి. పట్టణంలో పరువు హత్యకు సంబంధించి ఎన్నో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మాచర్ల సీఐ తురక వెంకటరమణ ప్రేమ వివాహం చేసుకున్న చౌడేశ్వరి పరువు హత్య కేసులో కీలక పాత్రధారిగా తేలడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు.

తల్లిదండ్రుల నుండి డబ్బులు తీసుకుని, యువతిని వారికి బలవంతంగా అప్పగించి, పరోక్షంగా ఆమె మరణానికి కారణమయ్యారని అంతర్గత విచారణలో నిర్ధారణ కావడంతో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్టి త్రిపాఠీ ఈ చర్యలు చేపట్టారు. నిందితుడు 23 ఏళ్ల చౌడేశ్వరి ప్రేమ పెళ్లి చేసుకోవడంతో సీఐ వెంకట రమణ ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులకు ఆశపడి యువతిని వారికి అప్పగించారు.అనంతరం ఆ యువతి పరువు హత్యకు గురైంది.

విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. ముక్కుపచ్చలారని ఆడబిడ్డ మరణానికి కారణమైన సీఐ వెంకట రమణను పోలీసు ఉన్నతాధికారులు కేవలం సస్పెన్షన్ తోనే సరిపెట్టారు. వాస్తవంగా లక్షలాది రూపాయలకు ఆశపడి, అన్యాయంగా ఒక ఆడబిడ్డ మరణానికి కారణమైన వ్యక్తికి ఎలాంటి శిక్ష విధించాలి? పోలీసు విచారణ నిష్పక్షపాతంగా జరిపినట్లైతే అతనికి ఆ ఉద్యోగం చేసే అర్హత కూడా లేదు. పైకి నిజాయితీపరుని లాగా, తనకు గబ్బర్ సింగ్ అనే ఇంకోపేరు కూడా ఉందని చెప్పుకునే ఈ సారుగారు చేసిన అక్రమ దందాలు అన్నీఇన్నీ కావు.

అన్యాయంగా ఒక ఆడబిడ్డ మరణానికి కారణం అయ్యారు . ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి ఇక్కడ తావే లేదు. న్యాయం కోసం మెట్లు ఎక్కిన ప్రతి ఒక్కరికి బూతులతో స్వాగతం పలకడం ఈయన నైజం. స్టేషన్ కి వచ్చేది న్యాయం కోసం. న్యాయం చేయాల్సిన రక్షక భటులే భక్షక భటులులాగా మారితే న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలి అనే చర్చ జరుగుతుంది. మేజర్లగా ఉన్న ఆడపిల్లలు భవిష్యత్తులో ప్రేమ వివాహాలు చేసుకున్న అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.

పోలీసులు న్యాయం చేస్తారని పోలీస్ స్టేషన్కు వెళ్తే డబ్బు కోసం కక్కుర్తి పడి పోలీసులే దగ్గరుండి మరణానికి దగ్గర అయ్యేలా ప్రవర్తిస్తుంటే ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ కేసులో కేవలం సీఐని సస్పెన్షన్ మాత్రమే చేశారు. విచారణ గురించి ఎటువంటి వివరాలు ఇప్పటికీ బయటకు రాలేదు. చనిపోయిన ఆ యువతి తాలూకా తల్లిదండ్రులు సిఐకు ఎంత ఆఫర్ చేశారు? ఆయన ఎంత తీసుకున్నాడు ?కుట్ర వెనక ఇంకెవరెవరు ఉన్నారు అనే వివరాలు ఇప్పటికీ బయటకు రాలేదు.

పోలీసులు నిజం దాస్తున్నారా ?నిందితుడిగా ఉన్న వ్యక్తి పోలీస్ అధికారి కావడంతో పోలీసులు విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నత అధికారులు సదరు సీఐపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి కేసులో ఉన్న నిజాలను వెలుగులోనికి తీసుకుని వచ్చి నిందితులందరినీ గుర్తించి శిక్ష పడేలా చేయాలని కోరుకున్నారు. ఇది ఇలా ఉండగా అదే స్టేషన్ కి చెందిన ఏఎస్ఐ శ్రీనివాస్ వీడియోల లీకులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రేమ జంటలను బెదిరించి, డబ్బులు వసూళ్లకు పాల్పడినందుకు మాచర్ల ఏఎస్సై శ్రీనివాసరావును కూడా సస్పెండ్ చేశారు.

రాత్రిపూట రోడ్లపై ఉండే జంటలను, పార్కుల్లో ఉండే ప్రేమికులను, ఒంటరిగా ఉండే స్త్రీలను టార్గెట్ చేసి ఈ అధికారి చేసిన రాసలీలలు అన్నీ ఇన్ని కావు. భద్రత కల్పించవలసిన బాధ్యతయుతమైన స్థానంలో ఉన్న ఏఎస్ఐ వారిని బెదిరించి డబ్బులు తీసుకోవడం, తన కోరిక తీర్చాలని వారిని లొంగదీసుకోవడం, వారి వీడియోలు తీసుకోవడం, తద్వారా వారిని బెదిరించి ఎన్నో అరాచకాలకు పాల్పడిన సంఘటన పట్ల పోలీసులపై నమ్మకం పోవటంతోపాటు అసహ్యం వేసే విధంగా మారింది. ఈ కేసులో కూడా కేవలం సస్పెన్షన్ తోనే సరిపెట్టారు.

కానీ ఇంతవరకు విచారణ సరిగా సాగడం లేదు. జమ్మలమడక గ్రామానికి చెందిన ఒక ఆటో డ్రైవర్ సహాయంతో ఈ వీడియోలో అన్ని రికార్డు చేశారు. కానీ ఇంతకీ ఆ ఆటో డ్రైవర్ ఎవరు అనేది ఇప్పటికి పోలీసులు ప్రకటించలేదు. డ్రోన్ వీడియోలు ఎన్నో ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ డ్రోన్ వీడియోల వెనక సదరు అధికారి కుమార్తె హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు విషయమై ఆమె మాట్లాడుతూ, తాను తప్పు చేయలేదని, నా ఫోన్ తీసుకుని విచారించండి.

మాది తప్పు ఉంటే నన్ను శిక్షించండి అని తెలిపారు. ఏ కుమార్తె కూడా తన తండ్రికి అలాంటి పనులకు సహకరించదని ఈ విషయంలో తన తండ్రికి తనకు ఎటువంటి సంబంధం లేదని మీడియాకు తెలిపారు. అయితే సదరు అధికారికి వీడియోలు ఎలా వచ్చాయి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. గతంలో ఆ అధికారి కుమార్తె మాచర్ల పట్టణాన్ని సందర్శించి జమ్మలమడక మరియు కొన్ని పరిసర ప్రాంతాల్లో కొన్ని డ్రోన్ వీడియోలను చిత్రీకరించింది. అదే సమయంలో డ్రోన్ పరిజ్ఞానంతో ఈ అధికారి తప్పుడు పనులకు ఉపయోగించారని బలమైన విమర్శ. సదరు విషయంపై పోలీసులు సరైన విచారణ చేస్తే గాని నిజాలు బయటికి రావు.

అప్పుడు మాత్రమే నిజమైన నేరస్తులు ఈ వీడియోలు వెనక ఉన్న మరి కొంత మంది దోషులు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలు విషయంలో ఇద్దరు విలేకరుల హస్తం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.రాత్రిపూట ఇద్దరు విలేకరులు కొన్ని వీడియోలు తీసి అధికారికి పంపడం, ఆ అధికారి ఆ వీడియోలో ఉన్న వ్యక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో పాటు సదరు విలేకరులకు కొంత ముట్టచెప్పేవాడని సమాచారం. ఆయా విలేకరులకు డబ్బులు ఇవ్వటం ఆపేయడంతో ఏఎస్ఐ రాసలీలల వీడియోలు లీక్ చేశారనే ప్రచారం జరుగుతుంది.

ఆటో డ్రైవర్ ఎవరు అనేది పోలీస్ అధికారులు ఇంకా ఎందుకు చెప్పలేదు? వీడియో రికార్డింగ్ సంబంధించిన వ్యక్తులు మొత్తం ఎంతమంది ఉన్నారో పోలీసులు తెలిపిన దాఖలు లేదు. సదరు వ్యక్తుల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లలో ఏ వీడియో బయటకి వస్తుందో తెలియక బాధితులు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిందితులను గుర్తించి, వారి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని,వీడియోలన్నీ పూర్తిగా డిలీట్ చేయాలని బాధితులు కోరుకుంటున్నాను. ఈ కేసులో పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు అనే విషయం అర్థం కావడం లేదు.

పోలీసులు తలచుకుంటే ఎలాంటి పెద్ద కేసునైనా రోజుల వ్యవధిలోనే ఛేదించగలరు అనేది నిజం. ఇటీవల మాచర్లలో ఓ మహిళ పై జరిగిన లైంగిక దాడి కేసు కొన్ని రోజుల వ్యవధిలోనే చేదించారు పోలీసులు. మరి పోలీసులే నిందితులుగా ఉన్న ఈ కేసుల్లో ఇంకా ఎందుకు విచారణ వేగవంతం చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు? పోలీస్ ప్రతిష్ట దెబ్బతింటుందనే సస్పెండ్ చేసి చేతులు దులుపు కున్నారు. అనే బలమైన విమర్శలు వస్తున్నాయి. దీనిని రాజకీయ వర్గాలు కూడా విమర్శ చేయుట కోసం ఉపయోగించుకుంటున్నాయి.

ఈ పోలీసుల వల్ల సామాన్యులకు రక్షణ లేదని, ప్రజలకు భద్రత కల్పించలేకపోతున్నారని, ప్రత్యర్థి రాజకీయ నాయకుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అంటే ఏమైనా ప్రజలకు ఏమాత్రం నమ్మకం కలగడం లేదు. పోలీస్ స్టేషన్ కి న్యాయం కోసం వెళ్తే డబ్బులు డిమాండ్ చేయటం, స్టేషన్ ఖర్చులు అని, బండికి ఆయిల్ అని, ఇంకా ఇతర కారణాలు చెప్పి, డబ్బులు వసూలు చేయడం పరిపాటి .

చిన్న సెటిల్మెంట్ చేసి, లక్షల్లో వసూలు చేస్తున్నారు అనే విమర్శ ఉంది. మాచర్ల పోలీస్ స్టేషన్, పోలీస్ అధికారులపై పడిన ఈ మచ్చ తొలగిపోవాలి అంటే,ఇప్పటికైనా పోలీసులు ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా ఈ రెండు కేసులను విచారించి, బాధితుల భయాన్ని తొలగించవలసి ఉన్నది. ఖాకి వ్యక్తులు తప్పు చేసినను పోలీసు అధికారులు వారిని శిక్షించి చట్టం ఎవరికి చుట్టం కాదు అని నిరూపించుకోవాల్సిన భాద్యత ఉంది. సదరు నిందితులపై విచారణ ఎంత కాలం సాగుతుందో, పోలీసుల వాస్తవ విషయాలు ప్రజలకు ఎంత త్వరగా తెలుపుతారో ఎదురు చూద్దాం.

Leave a Reply