కంచికచర్లలో కలకలం.. నిద్రిస్తున్న మహిళలపై కత్తితో దాడి

కంచికచర్లలో కలకలం.. నిద్రిస్తున్న మహిళలపై కత్తితో దాడి

కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ: కంచికచర్ల వసంత కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఇంటిలో నిద్రిస్తున్న ఓ మహిళపై అగంతకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయాడు. మంగళవారం వేకువ జామున ఈ సంఘటన చోటుచేసుకుంది. కంచికచర్ల గొట్టుముక్కల రోడ్డులోని బీసీ బాలుర హాస్టల్ వెనుక ప్రాంతంలో నల్లగట్ల రమాదేవి అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది. స్థానికంగా ఉన్న ఒక రెడీమేడ్ షాపులో పనిచేస్తూ రమాదేవి జీవనం సాగిస్తుంది. ఇంటి ముందరి భాగంలో నిద్రిస్తున్న మహిళలపై అగంతకుడు ఒక్కసారిగా కత్తితో దాడి చేసి, భుజం మీద, ఛాతి మీద, మొహం మీద, చేతుల మీద గాయపరిచి పరారయ్యాడు.

తీవ్ర రక్తస్రావం అవుతుండగా భయాందోళనలతో ఆమె కేకలు వేయడంతో ఇంటిపక్కల వారు వచ్చి ఆమెను వెంటనే కంచికచర్లలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన కంచికచర్లలో కలకలం రేకెత్తించింది. దాడి చేసిన వ్యక్తి హాస్టల్లోకి దూకి అటు నుంచి అటు పరారైనట్లు తెలుస్తుంది. సంఘటన వార్త తెలియగానే గ్రామీణ సీఐ చవాన్ బాధితురాలు ఇంటికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మహిళపై దాడి చేసిన వ్యక్తి ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడో పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

Leave a Reply