ఇక నుండి నో ప్లాస్టిక్

ఇక నుండి నో ప్లాస్టిక్

–ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యంగా పోరాటం
–ప్లాస్టిక్ నిర్మూలనకు కఠిన నిబంధనలు అమలు

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : మానవ శరీరంలోకి ‘స్లో పాయిజన్’లా చేరుతూ, పర్యావరణాన్ని కబళిస్తున్న ప్లాస్టిక్‌ను తరిమికొట్టేందుకు నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని పలు గ్రామాలు నడుం బిగించాయి. ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు కలిసి చేస్తున్న ఈ పోరాటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భీంగల్ మండలంలోని పిప్రి గ్రామ పంచాయతీ ప్లాస్టిక్ నిర్మూలనలో ఒక అడుగు ముందుకు వేసి కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. గ్రామంలోని హోటళ్లలో ప్లాస్టిక్ టీ కప్పుల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు.
హోటల్ నిర్వాహకులకు ఇబ్బంది కలగకుండా పంచాయతీ ఆధ్వర్యంలో ఉచితంగా స్టీల్ గ్లాసులను అందజేశారు. నిబంధనలు ఉల్లంఘించి ప్లాస్టిక్ కప్పులు వాడితే రూ. 5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే, ప్లాస్టిక్ వాడుతున్న వారిని పట్టించిన వారికి రూ. 1,000 నగదు బహుమతి ప్రకటించి ప్రజలను భాగస్వాములను చేశారు.

కేవలం పిప్రి గ్రామానికే పరిమితం కాకుండా, మండలంలోని చేంగల్, బడా భీంగల్, మెండోరా తదితర గ్రామాల్లో కూడా ప్లాస్టిక్ నిర్మూలన చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.ప్లాస్టిక్ ఇస్తార్లు, టీ కప్పులు, ఐస్‌క్రీమ్‌లతో పాటు అనారోగ్యకరమైన పద్ధతుల్లో (చనిపోయిన పశువుల మాంసం, ఎముకల నుండి తీసిన ఆయిల్) తయారు చేసే కారీలు, టోస్ట్‌ల విక్రయాలపై ఆంక్షలు విధించారు. శుభకార్యాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులకు స్వస్తి పలికేలా.. గ్రామంలోని దాతలు ముందుకు వచ్చి అందరికీ ఉపయోగపడేలా స్టీల్ ప్లేట్లు, గ్లాసులను సమకూరుస్తున్నారు.మొత్తానికి, ప్లాస్టిక్ మహమ్మారిపై భీంగల్ మండల ప్రజలు చేస్తున్న ఈ యుద్ధం ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

Leave a Reply