AP | వేసవి మొదలైతేనే నీటి సంక్షోభం తీవ్రం

AP | వేసవి మొదలైతేనే నీటి సంక్షోభం తీవ్రం
AP | భూగర్భ జలాల తగ్గుదలతో ఎండిపోతున్న బోర్లు
ప్రకాశం జిల్లాలో నీటి ట్యాంకులు వినియోగం లేక నిలిచిపోవడం
పలు జిల్లాల్లో 800కి పైగా గ్రామాల్లో నీటి కొరత
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిపోవడం లేదని ప్రజల ఆవేదన
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వేసవి ప్రారంభమవుతుండగానే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోవడంతో బోర్లు ఎండిపోతుండగా, కొన్నిచోట్ల నీరు అరకొరగా మాత్రమే వస్తోంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొత్తకోట పంచాయతీలో నిర్మించిన నీటి ట్యాంక్ ఉపయోగం లేక అలంకారప్రాయంగా మారింది. భూగర్భ జలాల తగ్గుదల కారణంగా పాత బోర్లు పనిచేయడం మానేశాయి. కొత్తగా బోర్లు తవ్వినా నీరు దొరకడం లేదు. కొన్ని ప్రాంతాల్లో 600 అడుగుల లోతు వరకు తవ్వినా నీరు పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, పొదిలి, చీమకుర్తి మండలాల్లోని చాలా గ్రామాల్లో బోర్లే ప్రధాన నీటి వనరులు. అయితే ప్రస్తుతం అవి కూడా సరిపడా నీటిని ఇవ్వడం లేదు. రెండు నెలల క్రితం వరకు 400 అడుగుల లోతులోనే నీరు లభించగా, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
రాష్ట్రంలోని అన్నమయ్య, శ్రీ సత్యసాయి, ఏలూరు, కర్నూలు, వైఎస్సార్ కడప, కృష్ణా జిల్లాల్లోని 800కు పైగా ఆవాస ప్రాంతాల్లో తాగునీటి కొరత నెలకొంది. సమస్య పరిష్కారానికి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అవి తగినంతగా లేవని ప్రజలు చెబుతున్నారు.
భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో కూడా బోర్లు, వాటర్ ట్యాంకుల నిర్వహణలో లోపాలు ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.
