రెండు దశాబ్దాల తర్వాత ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో డీజీపీ పర్యటన

రెండు దశాబ్దాల తర్వాత ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో డీజీపీ పర్యటన
నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న పోలీస్ బాస్ శివధర్ రెడ్డి
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : సరిగ్గా రెండు దశాబ్దాల కిందట ఎక్కడైతే ఒక యువ ఐపీఎస్ అధికారిగా శాంతిభద్రతల కోసం అలుపెరగని విధులు నిర్వహించి.. అదే ప్రాంగణంలో నేడు రాష్ట్ర పోలీస్ విభాగానికి బాస్‌గా ఆయన అడుగుపెట్టారు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి ఆదివారం బెల్లంపల్లి ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన సందర్భంగా అరుదైన, భావోద్వేగ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. 1998-2000 మధ్యకాలంలో శివధర్ రెడ్డి బెల్లంపల్లి అదనపు ఎస్పీగా పనిచేశారు.
రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ అదే కార్యాలయానికి రావడంతో అప్పటి జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్లముందు కదలాడాయి. హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న దుర్గామాత ఆలయాన్ని సందర్శించిన ఆయన, ఈ ఆలయ నిర్మాణానికి తానే స్వయంగా భూమిపూజ చేసి విగ్రహ ప్రతిష్టాపన చేసిన రోజులను స్మరించుకున్నారు. అప్పట్లో కేవలం ఆలయమే కాకుండా మసీదు, చర్చిల నిర్మాణానికి కూడా అంకురార్పణ చేసి సర్వమత సామరస్యాన్ని చాటామని అధికారులకు వివరించారు.

డీజీపీ పర్యటన సందర్భంగా ఆర్‌ఐ సంపత్, పాత సిబ్బంది అప్పట్లో ఆయన ఇక్కడ విధులు నిర్వహించిన కాలానికి సంబంధించిన అరుదైన ఫోటోలను సేకరించి ఒక ఆల్బమ్ రూపంలో అందజేశారు. వాటిని చూసిన డీజీపీ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. నాటి సహచర సిబ్బందిని, ఆనాటి కఠినమైన పని పరిస్థితులను గుర్తుచేసుకుని వారితో ఆనందాన్ని పంచుకున్నారు. “బెల్లంపల్లి ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌తో నాకు విడదీయలేని అనుబంధం ఉంది..
ఇది నా సొంత ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ కుమార్ దీపక్, సీపీ అంబర్ కిషోర్ ఝా, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, తదితరులు డీజీపీ వెంట ఉన్నారు.
