వృద్ధులు, నిరాశ్రయుల సేవతో 5వ వార్షికోత్సవం..

వృద్ధులు, నిరాశ్రయుల సేవతో 5వ వార్షికోత్సవం..

విజయవాడ, ఆంధ్రప్రభ : గత ఐదు సంవత్సరాలుగా నగరంలో వివిధ సేవాకార్యక్రమాలు చేస్తున్న హరివిల్లు ఫౌండేషన్ సేవాసంస్థ ఫౌండేషన్ స్థాపించి ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకుని ఆరవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆదివారం నగరంలోని వివిధ వృద్దాశ్రమాలలో బియ్యం నిత్యావసరాలు అందజేశారు. అంతేకాక విజయవాడ గాంధీనగర్ కూడలిలో భవానీపురంలో షుమారు ఆరు వందల మంది నిరాశ్రయులకు భోజనం ప్యాకెట్లు అందజేసి తమ మానవత్వం చాటుకున్నారు.

ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రధాన కార్యదర్శి అయిన డా. శరత్ కుమార్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం కేవలం ఆరుగురు సభ్యులతో ప్రారంభమైన తమ హరివిల్లు ఫౌండేషన్ సేవా సంస్థ నేడు నూట ఇరవై మంది సభ్యులతో కలిసి ఇప్పటివరకూ లక్షలాది రూపాయల విలువైన సేవాకార్యక్రమాలు చేయగలగడం తమకెంతో ఆనందాన్ని కలుగజేస్తుంది అని తెలియచేశారు.

ఫౌండేషన్ అధ్యక్షులు ఎం. శశికాంత్ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకూ విద్య, వైద్యం వంటివి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే కార్యక్రమాలు, అనాధాశ్రమాలు, వృద్దాశ్రమాలలో వారికి అవసరమైన నిత్యావసరాలు అందజేస్తున్నామని, పేద, దిగువ మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు నెలల క్రితమే నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో ఉచిత ప్రాథమిక వైద్య చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించి ఉచితంగా వైద్య సేవలు అందజేయడమే కాకుండా, వారికి అవసరమైన మందులను కూడా ఉచితంగానే అందజేస్తున్నామని, ఇంతకాలంగా ఇన్ని బృహత్తర సేవాకార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్న తమ సభ్యులు, సభ్యురాళ్లు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు.

ఈరోజు జరిగిన సేవాకార్యక్రమాలలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు ఎస్ కె.మొహమ్మద్ రఫీ, సహాయ కార్యదర్శి యు. కనకారావు, కార్యవర్గ సభ్యురాలైన శ్రీదేవి, సభ్యులు జి.ఎన్.బి.అప్పలరాజు, కిరణ్, శోభారాణి, ఎం.డి.ఇర్షాద్, పిట్ల రమేష్, బి. కిషోర్, పైలా సతీష్, బి.సుజన, పద్మావతి, లక్ష్మి, మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొని తమ సేవలను అందజేశారు.

Leave a Reply