హిందూపురంలో రాబరీ కేసు ఛేదన..
హిందూపురంలో రాబరీ కేసు ఛేదన..
10 గంటల్లో ముగ్గురు అరెస్ట్
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : హిందూపురం పట్టణంలో ఇటీవల జరిగిన రాబరీ కేసును పోలీసులు అత్యంత వేగంగా, చాకచక్యంగా కేవలం 10 గంటల వ్యవధిలోనే ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో దోపిడీకి గురైన బంగారు నగలు, నగదును కూడా స్వాధీనం చేసుకుని బాధితురాలికి తిరిగి అందించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. హిందూపురం డీఎస్పీ కె.వి. మహేష్ పర్యవేక్షణలో, హిందూపురం, పెనుకొండ పోలీసుల సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి, తక్షణమే అరెస్ట్ చేయగలిగారు. ఘటన వివరాల ప్రకారం, మే 1వ తేదీ ఉదయం సుమారు 7:50 గంటలకు హిందూపురం పట్టణానికి చెందిన ఎం. రాజేశ్వరమ్మ (63) ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచి ఉండగా, పెనుకొండకు వెళ్తున్నట్లు చెప్పిన డీజిల్ ఆటోలో ఎక్కారు. ఆ ఆటోలో ముందే పథకం ప్రకారం ఉన్న నిందితులు కొంత దూరం వెళ్లిన తర్వాత కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారు నగలు, నగదును దోచుకున్నారు.

అనంతరం కొట్నూరు గ్రామం దాటి బైలు ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఆమెను వదిలివేసి పరారయ్యారు. ఈ ఘటనలో సుమారు 83 గ్రాముల బంగారం, రూ.50,000 నగదు దోచుకోబడగా, మొత్తం విలువ సుమారు రూ.8.70 లక్షలు గా అంచనా వేశారు. కేసు నంబర్ Cr.No.66/2026గా నమోదు చేసి, 309(4), 127(2) r/w 3(5) BNS సెక్షన్ల కింద దర్యాప్తు ప్రారంభించారు. మే 3వ తేదీ ఉదయం సూపర్-బీ స్పిన్నింగ్ మిల్స్ సమీపంలో వాహనాల తనిఖీల సమయంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసిన వారిలో జబిపాషా (43), రషీదా (31)తో పాటు ఒక 13 ఏళ్ల జువైనల్ బాలుడు ఉన్నారు. వారిని అనంతరం జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. పోలీసులు నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన డీజిల్ ఆటో, కత్తి, బంగారు మాంగల్యం చైన్, డాలర్‌తో కూడిన చైన్, ఉంగరాలు, కమ్మీలు, మాటీలు, రూ.37,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె.వి. మహేష్ మాట్లాడుతూ, సంఘటన జరిగిన వెంటనే బాధితురాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు వేగంగా స్పందించి, సీసీ కెమెరాల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
పోలీసుల సమన్వయం, క్రమశిక్షణతో ఈ కేసు త్వరగా ఛేదించగలిగామని పేర్కొన్నారు. బాధితురాలు రాజేశ్వరమ్మ మాట్లాడుతూ, “సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను. వారు వెంటనే స్పందించి నా నగలు, నగదును తిరిగి అందించారు. వారికి నా కృతజ్ఞతలు,” అని తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, 2 టౌన్ సీఐ అబ్దుల్ కరీం, ఎస్ఐలు, ఇతర సిబ్బంది ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించారు. ప్రజలు అపరిచిత వాహనాల్లో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
