మూడు కాదు.. ముఫ్ఫై నెలలైంది..!

మూడు కాదు.. ముఫ్ఫై నెలలైంది..!
- మరి ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి..!?
- పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రం
- మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న ముఖ్యమంత్రికి కోటికి సున్నాలెన్నో తెలుసా..’ అని మండిపాటు
- అధికార కాంగ్రెస్, కేంద్రంలోని బిజెపి చీకటి దోస్తులని ధ్వజం
మంచిర్యాల ప్రతినిధి – ఆంధ్రప్రభ : ”మేము అధికారంలోకి మూడు నెలలు తిరగక ముందే అభివృద్ధి పనులు చేయలేమని గతంలో నొక్కి వ్యాక్యానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఫ్ఫై నెలలైనా ఎందుకు మాట బుకాయిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రిని మరి ఏం అనాలి” జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం మంచిర్యాలకు వచ్చిన ఆయన నస్పూర్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన తీరును దనుమాడారు. రైతుబంధుకు రామ్ రామ్ చెప్పారని దళిత బందుకు జై భీమ్ కొట్టారని కూడా కేటీఆర్ ఎద్దేవా చేశారు. సింగరేణి కాలరీస్లో 16,000 మందికి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక తాము ఇచ్చిన ఉద్యోగాల మీద ఏసీబీ విచారణ జరిపిస్తామని చెప్పడం సిగ్గుచేటని కేటీఆర్ దుయ్యబట్టారు.
కోటికి ఎన్ని సున్నాలో తెలుసా…
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనేం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు కోటీశ్వరులను చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కి అసలు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా అని ఎద్దేవా చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల గూర్చి మాట్లాడుతూ బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల మూడు నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ ను ఓడించారని, ఇప్పుడు ప్ల కార్డులు పట్టుకుంటే ఏం ఫలితం ఉంటుందని కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు.
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలన్నా వారసత్వ ఉద్యోగాలు రావాలన్న టిఆర్ఎస్ గెలుపు ఒకటే ప్రధానం మార్గమని తెలిపారు. అప్పుడు ఓడించి ఇప్పుడు ప్ల కార్డులు పట్టుకుంటే ఏం ఫలితం ఉంటుందని కూడా సుతిమెత్తగా కార్యకర్తలకు వివరించారు.
ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పి మాట తప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు సైనికుల్లో పనిచేయాలని కోరారు.
