చైతన్య దివిటీలు.. పరిషత్ నాటికలు..

చైతన్య దివిటీలు.. పరిషత్ నాటికలు..

యడ్లపాడు, ఆంధ్రప్రభ : లింగారావుపాలెం కొండవీటి కళా పరిషత్‌ 27వ జాతీయస్థాయి నాటికల పోటీలు రెండవ రోజు ప్రగడ రాజమోహనరావు కళాప్రాంగణంలో అనంతవరం ఎన్.టి.ఆర్. కళాపరిషత్ అధ్యక్షులుగుదే శ్రీదేవి పాండురంగారావు జ్యోతి ప్రజ్వలన చేయగా, లింగారావు పాలెం మాజీ ఎంపీటీసీ సభ్యులు తోకల వీరరాఘవయ్య నటరాజ పూజ చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో అతిథులు నాటక రంగం పరిస్థితులను కళాకారులు పరిషత్ నిర్వాహకులు నిర్వహించాల్సిన విషయాల పై ప్రసంగించారు.

స్రీ మాత్రే నమః నాటిక..
అందమైన కలల లోకంలో విహరిస్తున్న ఒక సామాన్య యువతి జీవితంలో జరిగిన ఓ అనూహ్య ప్రమాదంతో ఊహించని మలుపే స్త్రీ మాత్రే నమః నాటిక ఇతివృత్తం. ప్రేమించిన వాడితో పెళ్ళి,అమెరికాలో స్థిరపడాలనే ఓ యువతి కథ ఇది. కానీ ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని అంతా తలకిందులు చేసి,ఊహించని భారమైన బాధ్యతను ఆమె భుజాలపై ఉంచుతుంది. ఒకవైపు కెరీర్,మరోవైపు మోయలేని బాధ్యత.. రెండింటి మధ్య నలిగిపోతున్న ఆమెకు దిక్కుతోచని స్థితి ఎదురవుతుంది. సరిగ్గా అప్పుడే ఆమె జీవితంలోకి ఒక పెద్దాయన ప్రవేశించి, కష్టాల్లో ఉన్న ఆమెకు ఆమె ఆలోచనలను ధైర్యాన్ని ఇచ్చి, తిరిగి ఆమె జీవితాన్నే ఒక పెద్ద మలుపు తిప్పుతాడు.కన్నతల్లి కాకపోయినా,తల్లి స్థానంలో ఉన్న స్త్రీ ఎప్పుడూ తన వ్యక్తిగత ప్రేమ కంటే బాధ్యతకే అగ్రతాంబూలం ఇస్తుందని, సొంత సుఖాలను త్యాగం చేసి బాధ్యతను నెత్తిన పెట్టుకునే ప్రతి స్త్రీ మూర్తి వెనుక ఇలాంటి గొప్ప త్యాగం దాగి ఉంటుందని తెలియజేసింది ఈ నాటిక. స్వర్ణసూర్య డ్రామ రివర్స్‌(హైదరాబాద్‌) వారు సమర్పించినీ నాటిక పూర్ణిమా పెమ్మరాజు మూలకథకు రూపం.ఉదయ భాగవతుల నాటకీకరణ చేసి, దర్శకత్వం వహించారు.

మమ్మల్ని బతకనివ్వండి నాటిక..
ప్రకృతి వైపరీత్యం పగబట్టినా, మనుషుల్లో మానవత్వం మంటగలిసినా సామాన్యుడి బతుకు ఎంత దుర్భరంగా మారుతుందో కళ్ళకు కట్టినట్లు ప్రదర్శితమైంది ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటిక.వృద్ధాప్య భారంతో, పెన్షన్‌ డబ్బులే ప్రాణాధారంగా బతుకుతున్న ఓ జంట.. కుండపోత వర్షంలో చిక్కుకున్న వేళ, రక్షించాల్సిన వారే రాబందులై నిలువు దోపిడీకి పాల్పడిన తీరు సమాజపు క్రూరత్వాన్ని ఎండగట్టింది. బిడ్డలకు దూరమై, అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ, ఆఖరి నిమిషంలో భార్యను కాపాడుకునేందుకు ఆ వృద్ధుడు పడ్డ వేదన చూస్తుంటే ప్రేక్షకుల హృదయాలు ద్రవించాయి. విధి వంచించినా, మానవత్వం లేని మనుషులు ఆ జంటను చావు అంచున నిలబెట్టిన ఈ నాటిక, మూర్ఛ వ్యాధితో భార్య మరణించే సన్నివేశంతో విషాదాంతంగా ముగిసి కంటతడి పెట్టిస్తుంది. విజయవాడ సాంస్కృతిక సమితి(విజయవాడ) వారు సమర్పించిన ఈ నాటికకు రచనా, దర్శకత్వం సుఖమంచి కోటేశ్వరరావు వహించారు.

తరమెల్లి పోతున్నదో .. నాటిక
మరణం వరకు బ్రతకడం సాధారణం… కానీ మరణం తరువాత కూడా మనిషి పేరు నిలవాలంటే అతని జీవితం విలువైనదై ఉండాలి అనే సందేశంతో ఈ నాటిక సాగుతుంది.అన్నదమ్ముల మధ్య ప్రేమ, త్యాగం,బాధ్యతల విలువను హృదయాన్ని తాకే విధంగా చిత్రిస్తుంది. దశరధరామయ్య–శేషయ్య ఇద్దరు ప్రాణస్నేహితులు.శేషయ్య చదువుకుని ఉపాధ్యాయుడిగా ఎదుగుతాడు.కానీ పేదరికం వల్ల దశరధరామయ్య చదువు లేక కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తాడు. అయినా తన కొడుకు రాఘవరావును పెద్ద చదువులు చదివించాలని సంకల్పించి, ఆస్తి అమ్మి,అప్పులు చేసి చదివిస్తాడు. చిన్న కుమారుడు రంగనాధం తన చదువు మానేసి అన్న చదువుకు తోడ్పడతాడు.

కాలక్రమేణా రాఘవరావు ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. కానీ సంపద, స్థానం పెరిగేకొద్దీ కుటుంబ బంధాల విలువ తగ్గిపోతుంది. తమ్ముడు రంగనాధం,అతని భార్య అనసూయను ఇంట్లో పనివాళ్లలా చూడడం,చివరకు ఇంటి నుండి పంపించడం జరుగుతుంది.తమ్ముడి త్యాగాన్ని మరచిన అన్న,తన తప్పును ఆలస్యంగా గ్రహిస్తాడు.శేషయ్య మాస్టారు నిజాన్ని బయటపెట్టి రాఘవరావును ప్రశ్నించగా,తన తప్పు తెలుసుకున్న అన్న ఆస్తిని పంచిపెట్టాలని నిర్ణయించు కుంటాడు.కానీ అప్పటికే రంగనాధం మరణిస్తాడు.అనసూయ తన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ,డబ్బుకంటే సంబంధాల విలువ గొప్పదని తెలియజేస్తుంది.చివరగా శేషయ్య మాస్టారు సమాజాన్ని ప్రశ్నిస్తూ—ఆస్తులు పంచుకోవచ్చు గాని,ప్రేమను పంచుకోలేమా? అన్నదమ్ముల బంధం ఎందుకు “తరమెల్లి పోతున్నదో” అని హెచ్చరిస్తాడు. సారాంశంగా, ఈ నాటిక కుటుంబ బంధాల విలువ,త్యాగం, కృతజ్ఞత, ఆధునిక సమాజంలో తగ్గిపోతున్న అనుబంధాలను మనసుకు హత్తుకునే విధంగా తెలియజేసే శక్తివంతమైన సామాజిక సందేశం. ప్రేక్షకులను తీవ్రంగా ఆలోచింప జేసింది. కరణం సురేష్‌ మెమోరియల్‌ థియేటర్స్‌ వారు ప్రదర్శించిన ఈ నాటికను బొమ్మడి రామకృష్ణ రచన, దర్శకత్వం వహించారు.

ఈ కార్యక్రమానికి అతిధులుగా సినీ నటులు గోపరాజు, వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు, డాక్టర్ నాటక రచయిత కందిమళ్ళ సాంబశివరావు, గుంటూరు కళాపరిషత్ గౌరవ అధ్యక్షుడు ఆలోకం పెద్దబ్బాయి, అనంతలక్ష్మి నూనె మిల్లు ఎండి సామినేని కోటేశ్వరరావు, అనంతలక్ష్మీ ముద్దన రాఘవయ్య చౌదరి, ఆర్.రమణ, మీనంపల్లి రవీంద్రబాబు,దండా వీరాంజనేయులు, ముప్పాళ్ళ సుబ్బారావు, ఆడిటర్, మురుకుట్ల శ్రీధర్ కుమార్, తదితరులు ఉన్నారు.