చిట్యాలలో పాఠశాలల్లో ఫూలే జయంతి వేడుకలు

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. చల్లగరిగ, వాణి విద్యానికేతన్, మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ మేకల రమేష్, వాణి విద్యానికేతన్ కరస్పాండెంట్ బండి సంపత్ కుమార్ మాట్లాడుతూ, జ్యోతిరావు ఫూలే గొప్ప సామాజిక సంస్కర్త, కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు, మహిళా విద్యకు మార్గదర్శకుడు అని కొనియాడారు.
1873లో సత్యశోధక్ సమాజాన్ని స్థాపించి కుల నిర్మూలన, మహిళా విద్య, దళితుల హక్కుల కోసం కృషి చేశారని పేర్కొన్నారు. తన భార్య సావిత్రిబాయి ఫూలేతో కలిసి పూణేలో తొలి పాఠశాలను స్థాపించి సమాన హక్కుల కోసం పోరాడారని వివరించారు.
ఈ కార్యక్రమంలో వాణి విద్యానికేతన్ డైరెక్టర్ బండి ఇందిర, ఆదర్శ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ నీలం రవీందర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వాసాల వెంకటేశ్వర్లు, సమీరా, ధనలక్ష్మి, జోష్ణ, దివ్య, శివ, రాజు, భాస్కర్, ఆరేపల్లి రామ్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.
