మలయశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు

మలయశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు
చరిత్ర పరిశోధకుడు కంకణాల రాజేశ్వర్,
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : ప్రముఖ కవి, రచయిత, కథకుడు, నవలాకారుడు, శతాధిక గ్రంథ కర్త, విశ్రాంత ఉపాధ్యాయుడు, డాక్టర్ మలయశ్రీ (87) అస్తమించారు. తెలుగు సాహిత్య రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించి, తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం కలిగించిన ఆయన కొంతకాలంగా వయోభారంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మరణ వార్త విషయం తెలియడంతో భీమ్గల్ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కంకణాల రాజేశ్వర్ మలయ శ్రీ కుటుంబ సభ్యులతో ఫోన్లో సంభాషించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరీంనగర్ రేకుర్తి సమీప వేమన నగర్ లో నివాసం ఉండేవారు.
ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ హేతువాది, బుద్ధిష్ట్, తెలంగాణ ఉద్యమకారుడు, తెలుగు భాష సంరక్షణకు విశేష కృషి చేసిన తెలుగు భాషాభిమాని మలయశ్రీ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని చెంజర్ల లో 1940లో కార్తీక పౌర్ణమి రోజు జన్మించాడు. 150కి పైగా పుస్తకాలు రాశాడు. నవ్య సాహిత్య పరిషత్ ను స్థాపించి ప్రగతిశీల రచయితలకు ప్రతి ఏటా మలయశ్రీ సాహితీ అవార్డులను ఇచ్చారు. భీమ్గల్ మండలంలోని బాచన్ పల్లి గ్రామానికి చెందిన శాతవాహన విశ్వ విద్యాలయం తెలుగు శాఖ విభాగాధిపతి దివంగత డాక్టర్ కే.ముత్యం ద్వారా భీమ్గల్ పట్టణంలోని నందీశ్వరాలయ ప్రాంగణంలో గల శిథిల శిలా శాసనాల్ని, ప్రాచీన విగ్రహాల్ని పరిశోధించుటకు రెండు పర్యాయాలు భీమ్గల్ కు వచ్చారని కంకణాల రాజేశ్వర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వెయ్యేండ్ల జిల్లా సాహిత్య చరిత్రను “కరీంనగర్ జిల్లా సాహిత్య చరిత్ర” ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఎంఏ, ఎంఓఎల్, పి హెచ్ డి చేసిన ఆయన ప్రభుత్వ తెలుగు టీచర్ గా, లెక్చరర్ గా పనిచేశారు. కరీంనగర్ శివారు వేమన నగర్ లో స్థిరపడ్డారు. గంగాధర మండలం కురిక్యాల బొమ్మలమ్మ గుట్టపై క్రీ.శ. 946 కాలపు జిన వల్లభుని త్రిభాషా శాసనములోని మూడు కందపద్యాలే తెలుగు సాహిత్యంలో మొదటివనీ, కందం పుట్టింది కరీంనగర్ జిల్లాలో నేనని మలయశ్రీ తొలిసారిగా వెలుగులోకి తెచ్చారు. తెలంగాణ తెలుగు భాష ఎంత ప్రాచుర్యమైందో, అంతే విశిష్టమైందని, దానిని నిలబెట్టుకోవడం మన బాధ్యత అని మలయశ్రీ పలుమార్లు చెప్పారు. డాక్టర్ మలయశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని కంకణాల రాజేశ్వర్ అన్నారు.
