ipl thrilling match| ఐపీఎల్ మొదలైన అసలు మజా

ipl thrilling match| ఐపీఎల్ మొదలైన అసలు మజా
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ స్టార్ట్ అయ్యి పద్నాలుగు రోజులు కావొస్తోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచులన్నీ చాలా చప్పగా సాగాయి. ఉత్కంఠను కలిగించే మ్యాచ్ ఉందని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. అన్ని మ్యాచులు వన్‌సైడ్ వార్‌గా కొనసాగాయి. గత రెండు రోజులుగా సాగుతున్న మ్యాచులు అసలు సిసలు మజాను పంచుతున్నాయి. ఫ్యాన్స్‌కి హైటెన్షన్ పుట్టిస్తున్నాయి. ఎవరు గెలుస్తారో చివరి బంతి వరకు తేలని పరిస్థితి నెలకొంది. నువ్వా నేనా అన్నట్లు జట్లు పోరాడుతున్నాయి. ఐపీఎల్‌లో ఇది కదా కావాల్సింది అని ఫ్యాన్స్ సంబుర పడుతున్నారు. వన్‌సైడ్ మ్యాచులను చూసి చూసి బోరుకొడుతుందని, గత రెండు మ్యాచులు ఎంతో ఎంజాయ్‌మెంట్‌ను పంచాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టెన్షన్ కలిగించే మ్యాచులు చూస్తేనే అసలు సిసలు మజా ఉంటుందంటున్నారు. నిన్న మొన్న జరిగిన మ్యాచులు చూసినవారి ఆనందానికి అవధుల్లేవ్. వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైస్వాల్, ముకుల్ చౌదరి ఇలా ఒక్కో మ్యాచులో ఒక్కొక్క హీరో వెలుగులోకి వచ్చారు. అనామకులు అనుకున్న ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్‌లుగా అయిపోయారు. వారి ఆటతీరుతో మ్యాచ్‌ను మలుపు తిప్పారు.

ఈ సీజన్‌లో అసలైన జోష్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తోనే మొదలైంది. ఆఖరి ఓవర్ వరకు ఎవరు విజయం సాధిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. బౌలర్ల వ్యూహాలకు, బ్యాటర్ల మెరుపులకు మధ్య జరిగిన ఈ పోరులో చివరి బంతికి విజయం ఖరారవ్వడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ మ్యాచులో ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ వెళ్లింది. థ్రిల్లింగ్ కలిగించిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీపై ఒక్క పరుగు తేడాతో గుజరాత్ గెలిచింది.

ఇక మరో మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠను కలిగించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన పోరు ఈ సీజన్‌కే హైలెట్. ఈ మ్యాచ్‌లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ముకుల్ చౌదరి హీరోగా నిలిచాడు. లక్నో జట్టుకు ఓటమి ఖాయమనుకున్న తరుణంలో ముకుల్ అసాధారణ పోరాట పటిమ కనబరిచాడు. సిక్సర్లతో విరుచుకుపడి హాఫ్ సెంచరీ చేశాడు. ఆఖరి వరకు క్రీజ్‌లో ఉండి లక్నో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇలా రెండు మ్యాచులు ఆఖరి బంతి వరకు గెలుపోటములు ఊగిసలాడాయి. ఐపీఎల్‌లో ఇలాంటి టెన్షన్ మ్యాచులే కావాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
