మొక్కజొన్న రైతులకు మద్దతుగా ప్రజా ప్రభుత్వం..

మొక్కజొన్న రైతులకు మద్దతుగా ప్రజా ప్రభుత్వం..
- రైతులు సద్వినియోగం చేసుకోవాలి..
- సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి, ఆంధ్రప్రభ : రబీ సీజన్ లో రైతులు పండించిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని ప్రజా ప్రభుత్వం డీసీఎంఎస్ ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ధర్మపురి వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతులు ధర్మపురి నియోజకవర్గంలో 25 శాతం అధికంగా మొక్కజొన్న సాగు చేశారన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, వెల్గటూర్, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి మరియు ఎండపల్లి మండలాల్లో సీజన్ లో 4898 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారన్నారు. ఆరు మండలాల్లో సుమారుగా 1.46 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని, రైతులు పెద్ద ఎత్తున పంట సాగు చేసిన నేపథ్యంలో రైతులకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం మెక్కజోన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు.
రైతులు కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు విక్రయించి క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర పొందాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోలేదని, ధాన్యం కొనుగోలు లో క్వింటాల్ కు నాలుగు కిలోల కోత విధించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాలుగా ఎలాంటి కోత లేకుండా రైతులు పండించిన పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య లక్ష్మణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
