క్వారీ కేటాయించే వరకు ఉద్యమిస్తాం..

క్వారీ కేటాయించే వరకు ఉద్యమిస్తాం..
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి మారుతీరామ క్వారీ వర్కర్స్ సొసైటీకి క్వారీ సాధించే వరకు సభ్యులకు అండగా ఉండి ఉద్యమిస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ (సత్యం) తెలిపారు. కొండపల్లి శ్రామిక నగర్ (కొత్త గేటు) లోని మారుతీరామ క్వారీ వర్కర్స్ సొసైటీ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1984లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో సుమారు 175 కుటుంబాలతో మారుతీ రామ క్వారీ వర్కర్స్ సొసైటీ ఏర్పడింది అన్నారు. 2011లో ఈ క్వారీకి నివాసాలు దగ్గరగా ఉన్నాయని క్వారీ నిలిపివేసినట్లు చెప్పారు. అప్పటి నుంచి వేర్వేరు చోట్ల పని చేసిన కార్మికులు 2025లో క్వారీ కోసం అర్జీ పెట్టారన్నారు. అధికారులు గడ్డమణుగు లోయలో క్వారీ కేటాయిస్తే సొసైటీకి రాకుండా శ్రీధర్ అనే వ్యక్తి అడ్డు పడుతున్నారని చెప్పారు.
వడ్డెర సామాజికవర్గానికి చెందిన సొసైటీ సభ్యులంతా మొదటి నుంచి టీడీపీ సభ్యులని, అయినా కూటమి ప్రభుత్వంలో వారికి న్యాయం జరగడం లేదన్నారు. దీని బట్టి మైలవరంలో వైసీపీ పరిపాలన సాగుతుందా? లేక కూటమి పాలన సాగుతుందా? అన్న అనుమానం కలుగుతుందన్నారు. ఈ క్వారీ కోసం కలెక్టర్ లక్ష్మిశను, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను, బావమరిది కోటేశ్వరరావును, క్వారీ యజమాని శ్రీధర్ ను కలిస్తే ఆ క్వారీని వదిలేయాలని చెబుతున్నారని తెలిపారు. పోలీసులు, మైనింగ్ అధికారులు సొసైటీ సభ్యులైన వడ్డెరలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
క్వారీ వడ్డెర్ల పేరుమీద ఉన్నా ఎమ్మెల్యే చెప్పినట్లు చేయాలని అధికారులు చెబుతున్నారని మండిపడ్డారు. దీని పై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పందించి వడ్డెర్ల క్వారీని వారికే ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ క్వారీని సాధించే వరకు అక్కడే ఉద్యమిస్తామన్నారు. సమావేశంలో మారుతీరామ క్వారీ వర్కర్స్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
