హత్య కేసు ఛేదించిన పోలీసులు..

హత్య కేసు ఛేదించిన పోలీసులు..

రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేపాక గ్రామంలో జరిగిన హత్య కేసును రేగొండ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో రేపాక గ్రామానికి చెందిన కుర్రే చేరాలు (55) అనే వ్యక్తిపై అతని కుమారులు కుర్రే రామ్, కుర్రే లక్ష్మణ్‌లు గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు ఉదయం మరణించాడు.

పోలీసుల పరిశీలనలో మృతుడు అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధం కొనసాగించడం వల్ల కుటుంబంలో విభేదాలు ఏర్పడి, పూర్వ వైరం పెరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నిందితులు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఘటన అనంతరం పరారైన నిందితులను భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో రేగొండ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. రేగొండ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు తమ నేరాన్ని ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు.

నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, రక్తపు మరకలున్న బట్టలు, ఒక టూ వీలర్ వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, బాధిత మహిళ నుంచి అపహరించిన సుమారు 25 గ్రాముల బంగారు పుస్తెల తాడు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

ఈ కేసును త్వరితగతిన ఛేదించిన భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్, ఘనపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సిహెచ్ కరుణాకర్ రావు, రేగొండ ఎస్‌ఐ డి. సుధాకర్ మరియు రేగొండ పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Leave a Reply