సామాన్య భక్తుడే ముఖ్యం…

సామాన్య భక్తుడే ముఖ్యం…

దుర్గమ్మ ఆలయ ఈవో వీకే శీనా నాయక్

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ లోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు భక్తుల పట్ల అత్యంత మర్యాదతో, అభిమానంతో వ్యవహరించాలని ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ స్పష్టం చేశారు. ఆదివారం దేవస్థానంలోని వివిధ కీలక విభాగాల సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కీలక అంశాలపై ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. దేవాలయానికి వచ్చే ప్రతి భక్తుడు అమ్మవారి దర్శనం ముగించుకుని వెళ్లేటప్పుడు సంతృప్తితో వెళ్లాలని, వారి పట్ల చిరునవ్వుతో సేవలందించాలని సూచించారు.

అన్నదానం, ఫెస్టివల్ సెక్షన్, పూజా విభాగాలు, స్టేషనరీ వంటి భక్తులతో నేరుగా సంబంధం ఉన్న విభాగాల సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎండోమెంట్ యాక్ట్ (దేవాదాయ చట్టం) రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ, పారదర్శకమైన సేవలు అందించాలని వివరించారు. భక్తులతో ఎలా మాట్లాడాలి, రద్దీ సమయాల్లో సంయమనంతో ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

​సామాన్య భక్తుడే మన దేవస్థానానికి అత్యంత ముఖ్యమైన వ్యక్తి. వారికి మెరుగైన సేవలందించి, భక్తుల సంతృప్తి స్థాయిని పెంపొందించడమే మన లక్ష్యం అని ఈవో శీనా నాయక్ పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పి. చంద్రశేఖర్, కె. గంగాధర్, దేవస్థానంలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం భవిష్యత్తులోనూ ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని ఈవో తెలిపారు.

Leave a Reply