అట్టడుగు వర్గాల అభ్యున్నతే కూటమి ధ్యేయం…

అట్టడుగు వర్గాల అభ్యున్నతే కూటమి ధ్యేయం…
ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు
ఆశయాల సాధనే జగజీవన్ కు అసలైన నివాళి : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : దేశ గమనాన్ని మార్చిన గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని, ఆయన ఆశయాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం అక్షరాలా అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. మొదటగా మిల్లు జంక్షన్ వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సన్ రైజ్ కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సభలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏప్రిల్ నెల ముగ్గురు మహానుభావులైన జగజ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే, చంద్రబాబు నాయుడు జన్మించిన మాసమని గుర్తుచేశారు. ఇప్పటికే అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాలతో పాటు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నామని, వారిని చూసినప్పుడు యువత స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. రక్షణ, వ్యవసాయ, కార్మిక శాఖల మంత్రిగా జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు అనన్య సామాన్యమని మంత్రి కొనియాడారు..
ఆహార సంక్షోభ సమయంలోనూ, యుద్ధ కాలంలోనూ ఆయన చూపిన సమర్థత మరువలేనిదన్నారు. కూటమి ప్రభుత్వం వివక్షత లేని పాలన అందిస్తోందని, గతంలో పున్నయ్య కమిషన్ 42 సిఫార్సుల్లో 27 జీవోలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. 29 ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో 27 చోట్ల కూటమి గెలవడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని, అడిగిన సైట్ విషయమై పరిశీలిస్తున్నామని, ఇప్పటికే అంబేద్కర్ ఆడిటోరియంను బాగు చేసి బీసీ భవన్‌ను నిర్మించామని వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ, 1905లో జన్మించిన జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధునిగా, కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ముఖ్యంగా వ్యవసాయ, రక్షణ శాఖల మంత్రిగా ఆయన చూపిన చొరవ అద్భుతమని తెలిపారు . నేటి యువత, విద్యార్థులు బాబుజీని స్ఫూర్తిగా తీసుకుని విద్యావంతులుగా ఎదిగి, ఉన్నత పదవులను అధిష్టించాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ, జగజ్జీవన్ రామ్ 50 ఏళ్లు ఎంపీగా, 30 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉండి కార్మిక శ్రేయస్సు కోసం అనేక చట్టాలు తెచ్చారని కొనియాడారు.
కమ్యూనిటీ హాల్ మంజూరు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే సాధిస్తామని చెప్పారు. హరిత విప్లవం, ఇండో-పాక్ యుద్ధ సమయంలో ఆయన పాత్రను ఆర్డీవో సాయి ప్రత్యూష వివరించగా, కనీస వేతనాల చట్టం ఆయన కృషేనని మున్సిపల్ కమిషనర్ కూర్మారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ఎస్.సి కార్పొరేషన్ ఈడి వినాయకం, పి.ఎం.జె బాబు, మాదరపు వెంకటేష్, రమణ మాదిగ, ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయి వేణుగోపాల్, ప్రొఫెసర్ ఎం. చిన్నారావు, వి. యాదగిరి, వేణు తదితరులు పాల్గొన్నారు.
