Andhra Prabha SPL Story | భారత్‌కు సంక్షోభం ఒక అవకాశమా.?

Andhra Prabha SPL Story | భారత్‌కు సంక్షోభం ఒక అవకాశమా.?
Andhra Prabha SPL Story |పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం రూపాయిపై
రూపాయి పతనం మరియు ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు
విదేశీ పెట్టుబడులు, చమురు ధరలు మరియు ఆర్థిక ఒత్తిడి
ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక వ్యవస్థపై ప్రభావాలు
ఎగుమతులు, దిగుమతులు మరియు రూపాయి బలహీనత
డాలర్ ఆధిపత్యం మరియు బ్రిక్స్ ప్రయత్నాలు
Andhra Prabha SPL Story | పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం మన రూపాయిపై పడింది. యుద్ధం కారణంగా డాలర్‌తో రూపాయి పతనం, జీవితకాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఒక్క మార్చి నెలలోనే డాలర్‌తో రూపాయి మారకపు విలువ 95 రూపాయల దాకా పడిపోవడం ఆందోళన కలిగించే పరిణామం. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 10 శాతం పతనం అయిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహిచుకోవచ్చు. ఇంతటి ఆందోళనకర పరిస్థితుల్లో కారణాలను అన్వేషించకుండా, పరిస్థితిని చక్కబెట్టేందుకు చర్యలు తీసుకొనకపోగా, సాక్షాత్తు పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటన దేశ ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. మన దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి అని చెప్పడం పలు విమర్శలకు దారి తీస్తోంది.
ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 10 శాతం క్షీణించడం, గడిచిన 14 ఏళ్లలోనే ఇది అత్యధిక పతనంగా పేర్కొనవచ్చు. ఇంత పతనావస్థలో ఉన్న రూపాయి పట్ల నిర్మల వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ హయాంలో డాలర్‌తో రూపాయి మారకపు విలువ 62 రూపాయలు దాటితేనే ఎన్డిఏ ప్రభుత్వం గందరగోళం చేసిన విషయం మరువలేమని నెటిజన్లు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. 2014తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 50 శాతం పైబడి పడిపోవడం ఆందోళన కలిగించే విషయం. ఒక మార్చి నెలలోనే మూడు రూపాయలపై పడిపోవడం పరిస్థితి చేయి దాటిపోతుందో అర్థమవుతుంది.
కరోనా సంక్షోభం తర్వాత ఇదే అతి పెద్ద పతనంగా పేర్కొనవచ్చు. 2025లో డాలర్ పడిపోతున్నా, మన రూపాయి కూడా పడిపోవడం విచిత్రం. విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయి, చమురు ధరలు విపరీతంగా పెరగడం, దిగుమతి ఖర్చులు పెరగడం ప్రధాన కారణాలు. కేంద్ర ప్రభుత్వం కూడా కొంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిందని చెప్పక తప్పదు. ప్రపంచ వాణిజ్య ఘర్షణలు, ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం పెరగడం కూడా పరిస్థితిని క్లిష్టం చేశాయి.
ద్రవ్యోల్బణం కట్టడి కీలకం: ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికాభివృద్ధి దెబ్బతినకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత. రూపాయి విలువ పడిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావాలు చూపుతోంది. దిగుమతుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం కట్టు తప్పుతుంది. ఇంధనం ధరలు పెరిగితే ఖర్చులు పెరుగుతాయి, వినియోగం తగ్గుతుంది. అయితే ఎగుమతుల విషయంలో రూపాయి బలహీనత ప్రయోజనకరం. దేశీయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో చౌకగా మారుతాయి.
యుద్ధం ప్రారంభమైన తర్వాత చమురు ధరలు 40 శాతం పెరగడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. భారత్ 80 శాతం దిగుమతులపై ఆధారపడుతుంది. దీనివల్ల డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది, రూపాయి విలువ తగ్గుతుంది. రష్యాపై ఆంక్షలు, ఇరాన్‌పై ఆంక్షలు కూడా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. డాలర్‌కు ప్రత్యామ్నాయం కోసం వేట ముమ్మరమైంది. బ్రిక్స్ కూటమి ప్రయత్నాలు వేగం పెంచాయి. అమెరికా రుణభారం పెరగడం, రాజకీయ అనిస్థితి, యుద్ధ వాతావరణం, డాలర్‌పై నమ్మకం దెబ్బతినడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. గల్ఫ్ ప్రాంతాల్లో రేమిటెన్సెస్ తగ్గడం కూడా ఆందోళన కలిగించే విషయం. ఏదేమైనా, భారత్ ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని, అభివృద్ధి పథంలో పయనిస్తేనే, వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుంది.
- గోపాలుని రాధాకృష్ణ
98853 90232
