11440CrPackage | వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు మరో రూ.8 వేల కోట్లు!

11440CrPackage | వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు మరో రూ.8 వేల కోట్లు!

11440CrPackage |ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీతో కొంత స్థిరత్వం సాధించిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు మరోసారి ఊరట లభించనుంది. ప్లాంట్ కార్యకలాపాలను మరింత సుస్థిరంగా కొనసాగించేందుకు కేంద్రం మరో రూ.8,097 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఈ ప్రతిపాదనకు సంబంధించిన ఫైల్‌ను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆమోదించి, తదుపరి చర్యల కోసం ఆర్థిక శాఖకు పంపినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ వ్యయ విభాగం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్‌లో మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు ప్రారంభమై కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉక్కు ఉత్పత్తి, అమ్మకాలు కూడా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సానుకూల పరిస్థితి దీర్ఘకాలం కొనసాగేందుకు అవసరమైన మద్దతు అందించడమే లక్ష్యంగా రెండో దశ ప్యాకేజీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంతో జరిపిన సంప్రదింపుల ఫలితంగా తొలి దశలో రూ.11,440 కోట్ల ప్యాకేజీ మంజూరైంది. అందులో రూ.10,300 కోట్లు ఈక్విటీ రూపంలో, మరో రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రుణాల రూపంలో అందించారు.

ఇప్పుడు ప్రతిపాదిత రూ.8,097 కోట్ల నిధులను కూడా ఈక్విటీ రూపంలోనే సమకూర్చాలని కేంద్ర ఉక్కుశాఖ నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో విశాఖ స్టీల్‌ప్లాంట్ భవిష్యత్తుపై ఆశలు మరింత బలపడుతున్నాయి.

Leave a Reply