చట్టబద్ధతతో రాష్ట్రానికి స్థిరత్వం, సుస్థిరత…

చట్టబద్ధతతో రాష్ట్రానికి స్థిరత్వం, సుస్థిరత…

వింత పేర్లతో విషం కక్కుతున్న జగన్మోహన్ రెడ్డి…
భావితరాల అభివృద్ధికి కేంద్రంగా అమరావతి…
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు.. .
గొల్లపూడిలో కూటమి కుటుంబ సభ్యుల ర్యాలీ…

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్థిరత్వం, సుస్థిరత ఉంటుందని, రాజధాని సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కుతుందని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమరావతిని అభివృద్ధి చేసి ఏపీని ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. అమరావతి రాజధానిగా పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదంతో ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ శుభ సందర్భంగా విజయవాడ రూరల్ గొల్లపూడిలో కూటమి కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం కాగడాలు చేతబూని భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో అతి తక్కువ కాలంలోనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రజల ఉక్కు సంకల్పం, అమరావతి రైతుల త్యాగఫలం, సీఎం చంద్రబాబు కృషి పట్టుదల, కూటమి ప్రభుత్వం కృషితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కలలు సాకారం అవుతున్నాయని అన్నారు. ప్రధాని మోడీకి, సీఎం చంద్రబాబు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.

వింత పేర్లతో విషం కక్కుతున్న జగన్మోహన్ రెడ్డి…

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ఉమ్మడి ఏపీని సాధించి హైదరాబాదును రాజధానిగా అభివృద్ధి చేసుకుంటే, 2014లో మళ్ళీ మరోసారి విడిపోయి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారన్నారు. మళ్ళీ రాజధానిగా దార్శనికుడు సీఎం చంద్రబాబు సారథ్యంలో అమరావతిని అభివృద్ధి చేసుకుంటే, 2019లో ఒక్క అవకాశం అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాజధానిపై కుట్రలు చేశాడన్నారు. అమరావతి మనందరికీ ఒక సెంటిమెంట్ అని, ఐదేళ్ల పాటు రాజధాని లేకుండా చేసిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ‘మావిగన్’ వంటి వింత పేర్లతో తన ద్వేషాన్ని చాటుకుంటున్నారన్నారు.

అమరావతి పేరు వింటేనే జగన్ విషం కక్కుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరిందనన్నారు. 2019–24 మధ్య కాలంలో ఏపీ రాజధాని తీవ్ర అనిశ్చితిని చవిచూసిందన్నారు. గత వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అనాలోచిత నిర్ణయం తీసుకుంది. దీన్ని అప్పట్లో జగన్ ఇంట్లోనే తను తొలి సమావేశంలోనే వ్యతిరేకించానన్నారు. అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నానని ప్రతిపక్ష హోదాలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల వ్యవహారాన్ని తెర పైకి తెచ్చారు. అమరావతి పట్ల జగన్ మోహన్ రెడ్డి వైఖరి ఎప్పటికీ మారదని నిన్నటి మీడియా సమావేశంతో మరోసారి స్పష్టమైందన్నారు.

అమరావతి రాజధాని బిల్లును కూడా వైసీపీ వ్యతిరేకించిందన్నారు. గ్రామాల్లో వైసీపీ నాయకులను దీనిపై ప్రజలు ప్రశ్నించాలన్నారు. విశాఖపట్నం, కర్నూలుకు పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయని అన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అభివృద్ధి నిరోధకుడు జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా అధికారంలోకి రాకుండా చేయాలని పిలుపునిచ్చారు.

భావితరాల అభివృద్ధికి కేంద్రం అమరావతి…

ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాజధానిది కీలకపాత్ర. ఇప్పుడు నిర్మించే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది. 75 ఏళ్ల వయసులో 25 ఏళ్ల నవయువకునిగా శ్రమిస్తూ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పునఃనిర్మిస్తున్నాడని అన్నారు. అమరావతిలో రూ.56వేల కోట్లతో అత్యంత ముఖ్యమైన 91 మౌలిక ప్రాజెక్టుల నిర్మాణం సాగుతోందన్నారు. కేంద్రం హడ్కో ద్వారా రూ.11వేల కోట్ల రుణం అందించిందన్నారు.

ప్రపంచబ్యాంకు, ఏడీబీ, కేంద్రం కలిపి రూ.15వేల కోట్ల సాయం చేస్తున్నాయన్నారు. క్వాంటమ్ వ్యాలీతో అమరావతి కొత్త చరిత్రకు నాంది పలుకుతుందన్నారు. అమరావతి రాజధానితో ఎన్నో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుందన్నారు. భావితరాల అభివృద్ధికి కేంద్రంగా అమరావతి మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇంచార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల) , తదితరులు పాల్గొన్నారు