మానవీయత చాటుకున్న కలెక్టర్

మానవీయత చాటుకున్న కలెక్టర్

  • అస్వస్థతకు గురైన విద్యార్థినికి అండగా రాహుల్ శర్మ

గణపురం, ఆంధ్రప్రభ : పదో తరగతి పరీక్షల వేళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. పరీక్ష రాస్తూ అస్వస్థతకు గురైన ఓ విద్యార్థినిని స్వయంగా తన ప్రభుత్వ వాహనంలోనే ఆస్పత్రికి తరలించి, సకాలంలో వైద్యం అందేలా చూసి అందరి ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గురువారం ఘనపురం మండలం చెల్పూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అదే సమయంలో గాంధీనగర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలకు చెందిన కీర్తన అనే విద్యార్థిని తీవ్ర శ్వాసకోస సమస్యతో ఇబ్బంది పడుతూ నీరసించిపోయింది. విషయం గమనించిన కలెక్టర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన వ్యక్తిగత సిబ్బందిని అప్రమత్తం చేశారు. తన అధికారిక వాహనంలోనే ఆ విద్యార్థినిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు.

పరీక్షా కేంద్రం పరిశీలన ముగించుకున్న అనంతరం, కలెక్టర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కలెక్టర్ స్వయంగా వచ్చి ధైర్యం చెప్పడంతో ఆ విద్యార్థిని కోలుకుంది. అనంతరం ఆమెను తిరిగి తన వాహనంలోనే పరీక్షా కేంద్రానికి పంపించి పరీక్ష రాసేలా ప్రోత్సహించారు. ఆపద సమయంలో ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి సామాన్యుడిలా స్పందించిన కలెక్టర్ తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Leave a Reply