బీసీలను ఓటు బ్యాంకుగానే..

బీసీలను ఓటు బ్యాంకుగానే..
బీసీ ప్రజా సంఘం నేత భరత్
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఎన్నో ఏండ్లుగా వెనకబడిన బీసీ ప్రజానికాన్ని పాలకులు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ అన్నారు. దేశంలో అత్యధికంగా ఉన్న బిసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో అందాల్సిన వాటా దక్కకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నాయిని భరత్ మీడియాతో మాట్లాడారు. దేశంలోని బీసీల డిమాండ్లను నేరవేర్చాలన్నారు. ప్రధానంగా బీసీ కులగణన చేపట్టాలని, బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలన్నారు.
రాష్ట్రాలలోని స్థానిక సంస్థలు అసెంబ్లీ, పార్లమెంటు సీట్లల్లో బిసీలకు అత్యధిక సీట్లు కేటాయించాలన్నారు. కేంద్ర బడ్జెట్లో బీసీలకు నిధులలో సరైన వాటాను కేటాయించాలన్నారు. విద్యా, ఉద్యోగాలలో బిసీల వాటా బిసీలకు దక్కెలా కృషి చేయాలని, మహిళా బిల్లులో బిసీ మహిళలకు వారి కోటా రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. దేశంలో 60శాతం ఉన్న జనాభాకు 27 శాతం మా త్రమే రిజర్వేషన్లు ఉన్నాయని, జనాభా ప్రాతిపాదికన బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు అమలు చేయలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం సాంబయ్య, ప్రధాన కార్యదర్శి వాసం సురేష్, కార్యదర్శి పాల రంజిత్, గుడికందుల వీరేశం, నాయకులు గొగ్గుల సాంబయ్య, అల్లం కేదారి పాల్గొన్నారు.
