సిండికేట్ వ్యాపారులకు షాక్…
సిండికేట్ వ్యాపారులకు షాక్…
- యువకుల ఎంట్రీతో రికార్డు స్థాయికి అంగడి వేలం
- రూ. 50లక్షలు దాటిన అంగడి వేలం..
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి అంగడి వేలం సందర్భంగా సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరకు వేలం దక్కించుకోవాలని ప్రయత్నించిన వ్యాపారులకు గ్రామ యువకులు గట్టి షాక్ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకొచ్చిన యువకులు వేలంలో పాల్గొనడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వివరాల్లోకి వెళితే… బుధవారం రఘునాథపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దా జరిగిన వేలం పాటలో అంగడి వేలం ఎక్కువ ధరకు వెళ్లకుండా కొంతమంది వ్యాపారులు ముందుగానే సిండికేట్‌గా ఏర్పడి వేలం ప్రక్రియను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు.
అయితే ఈ వ్యవహారాన్ని గమనించిన గ్రామానికి చెందిన గ్రామ యువకులు దుబ్బాక హరీష్ గౌడ్, ఇమ్మడిశెట్టి శివరాం, శాడ శ్రీనివాస్ ధైర్యంగా వేలంలో పాల్గొన్నారు. యువకులు వేలంలోకి రావడంతో సిండికేట్ వ్యాపారుల లెక్కలు తప్పిపోయాయి. పోటీ పెరగడంతో వేలం ధర ఒక్కసారిగా పెరుగుతూ చివరకు రికార్డు స్థాయిలో రూ.50 లక్షలు వేలం పాట దాటింది.
