కలెక్టర్‌గా సి.యం. సాయి కాంత్ వర్మ బాధ్యతలు స్వీకారం

కలెక్టర్‌గా సి.యం. సాయి కాంత్ వర్మ బాధ్యతలు స్వీకారం

గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి సి.యం. సాయి కాంత్ వర్మ బుధవారం అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2015 బ్యాచ్‌కు చెందిన ఆయన, రాష్ట్రంలో పలు కీలక పదవుల్లో సేవలందించి పరిపాలనా అనుభవాన్ని సొంతం చేసుకున్నారు.
విశాఖపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా, రాజమహేంద్రవరంలో సబ్ కలెక్టర్‌గా, శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా, వైఎస్సార్ కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, అలాగే ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.

పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్ సాయి కాంత్ వర్మ, గుంటూరు వంటి ప్రాధాన్యత గల జిల్లాలో సేవలందించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఉంచిన నమ్మకానికి తగిన విధంగా పని చేస్తానని తెలిపారు. జిల్లాలో సర్వతోముఖ అభివృద్ధికి కట్టుబడి, సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలవడానికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “స్వర్ణాంధ్ర విజన్ @2047”, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, పథకాల పట్ల ప్రజల సంతృప్తి పెంపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.

ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో సమన్వయంగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమానికి ముందు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జీఎంసీ కమిషనర్ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, ఆర్డీఓ కె. శ్రీనివాసరావు, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply