హనుమాన్ విజయోత్సవ ర్యాలీ..

హనుమాన్ విజయోత్సవ ర్యాలీ..
కడెం, ఆంధ్రప్రభ : మండలంలోని పెద్ద బెల్లాల్ జిపి పరిధిలో గల మొర్రి గూడెం గ్రామంలో శ్రీ అభయాంజనేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ స్వాముల విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం హనుమాన్ మాల ధరించిన స్వాముల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ ప్రారంభమైంది.
గ్రామ వీధుల గుండా సాగిన ఈ ర్యాలీ నృత్యాలు, భక్తి గీతాలతో ఉత్సాహభరితంగా కొనసాగింది. యువకులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొని జై శ్రీరాం, జై హనుమాన్ నినాదాలతో గ్రామాన్ని మార్మోగించారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పగా, గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద బెల్లాల్ గ్రామ సర్పంచ్ ఈదూల తిరుపతి, ఉప సర్పంచ్ తక్కల్ల రమ్య రవీందర్, వార్డు సభ్యులు తాటికొండ వెంకటేష్, గ్రామ పెద్దలు వెంకటేష్, మల్లేష్, నరేష్, రాజు, మురళి, రాకేష్, తిరుపతి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
