జాబ్‌మేళాతో 1,125 ఉద్యోగాలు యువతకు నైపుణ్యాలే కీలకం

జాబ్‌మేళాతో 1,125 ఉద్యోగాలు యువతకు నైపుణ్యాలే కీలకం

మంత్రి టీజీ భరత్ గుప్తా..

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఒక్కరికి ఉద్యోగం లభిస్తే ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని బి.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో నిర్వహించిన జాబ్‌మేళాను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాబ్‌మేళా ద్వారా 17 కంపెనీలలో మొత్తం 1,125 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. యువతీ, యువకులు తగిన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఉద్యోగాలను సాధించాలన్నారు. ఉద్యోగం సాధించిన తర్వాత కూడా అదే సంస్థలో స్థిరంగా కొనసాగేందుకు అవసరమైన స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని సూచించారు.

ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్‌మేళాలు నిర్వహిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా జిల్లాలో ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఓర్వకల్లు ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పరిశ్రమలను తీసుకువస్తున్నామని, జైరాజ్ ఇస్పాత్ కంపెనీ ఇప్పటికే స్థాపించబడగా, ఇప్పుడు అదనంగా రూ.6,000 కోట్ల పెట్టుబడితో విస్తరణ చేపడుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అవసరమైన మేరకు ప్రభుత్వ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ దీప్తి, కళాశాల ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్, ఏపీఐఐసీ డైరెక్టర్ జగదీష్ గుప్తా, డీఎస్పీ మెహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply