29marchchintana | అహింసతో శాంతి వైపు మానవాళికి మహాగురువు సందేశం

29marchchintana | అహింసతో శాంతి వైపు మానవాళికి మహాగురువు సందేశం

29marchchintana | మహావీరుడి ఆధ్యాత్మిక మహోన్నత స్థానం
త్యాగం, తపస్సు, ఆత్మజయానికి మహావీర జీవితం
నేటి సమాజానికి మహావీర బోధనల అవసరం
అహింస, సత్యం, అపరిగ్రహం ప్రాముఖ్యత
మహావీర జయంతి – ఆచరణలో పెట్టాల్సిన విలువలు

29marchchintana | ప్రపంచ చరిత్రలో కొన్ని మహనీయుల బోధనలు కాలగమనాన్ని దాటి యుగయుగాలపాటు మానవ సమాజానీ మార్గదర్శకత్వం వహిస్తుంటాయి. అలాంటి ఆధ్యాత్మిక మహోన్నతుల్లో జైనమత 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు విశిష్ట స్థానాన్ని పొందారు. అహింస, సత్యం, ఆత్మనిగ్రహం, అపరిగ్రహం, సమభావం వంటి శాశ్వత జీవన విలువలను ప్రపంచానికి బోధించిన మహావీరుడు కేవలం జైనమతానికి మాత్రమే పరిమితమైన మహర్షి కాదు; సమస్త మానవాళికి ఆత్మ శాంతి, నైతికత, మానవత్వం వైపు దారి చూపిన మహాగురు.

మహావీరుడి జీవితం త్యాగానికి, తపస్సుకు, ఆత్మజయానికి ప్రతీక. రాజవంశంలో జన్మించి సుఖసౌకర్యాల మధ్య పెరిగినా, జీవిత సారాన్ని భోగాలలో కాక, ఆత్మ శోధనలో అన్వేషించిన మహావీరుడు భౌతిక వైభవాన్ని త్యజించి తపోమార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన సాధించిన కేవల జ్ఞానం మానవ జీవితానికి అత్యున్నత సత్యాన్ని పరిచయం చేసింది. బాహ్య ప్రపంచాన్ని జయించడంకంటే మనిషి తనలోని కోపం, మోహం, లోభం, అహంకారం, హింసా స్వభావాన్ని జయించడమే నిజమైన విజయం అని ఆయన తన జీవితంతో నిరూపించారు.

29marchchintana
29marchchintana

నేటి సమాజ పరిస్థితులను గమనిస్తే మహావీరుడి బోధనలు ఎంత అత్యవసరమో స్పష్టమవుతుంది. విజ్ఞానం పెరిగినా వివేకం తగ్గిపోతున్నది. సాంకేతికత విస్తరించినా సహనం క్షీణిస్తున్నది. సంపద పెరిగినా సంతృప్తి కనుమరుగవుతున్నది. కుటుంబాల్లో కలహాలు, సమాజంలో విద్వేషాలు, వ్యక్తి జీవితంలో అస్థిరత, మానసిక ఆందోళనలు పెరుగుతున్న ఈ కాలంలో మహావీరుడి అహింసా సిద్ధాంతం సమాజానికి అత్యంత అవసరమైన ఔషధంగా కనిపిస్తుంది. హింస అనేది కేవలం ఆయుధాలతోనే కాదు; మాటలతో, మనస్తత్వంతో, ప్రవర్తనతో కూడా జరుగుతుందని ఆయన బోధన మనకు గుర్తు చేస్తుంది. అదేవిధంగా మహావీరుడు ప్రతిపాదించిన సత్యం మరియు అపరిగ్రహం నేటి వినియోగవాద, పోటీ, అసూయల ఆధారిత జీవనశైలికి గొప్ప ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. అవసరాల కంటే ఆశలు ఎక్కువైపోయిన ఈ యుగంలో మనిషి తన కోరికలకు బానిసవుతున్నాడు. ఆస్తి, అధికారం, ప్రదర్శనల కోసం పరుగులు తీస్తున్న ఆధునిక సమాజానికి “అవసరానికి మించి ఆశించకపోవడం” అనే మహావీర సందేశం అత్యంత సముచితం. వ్యక్తి తన మనసును నియంత్రించగలిగితేనే సమాజం శాంతి, సమతుల్యత వైపు పయనించగలదనే సత్యాన్ని బలంగా తెలియజేస్తాయి.

ఈ నేపథ్యంలో మహావీర జయంతి కేవలం ఒక ఆచారపరమైన వేడుకగా మిగలకూడదు. ప్రస్తుతం మనం స్మరించుకుంటున్న సుమారు 2625వ మహావీర జయంతి విలువల పునరుద్ధరణకు ఒక మహత్తర అవకాశంగా మారాలి. శోభాయాత్రలు, పూజలు, సభలు నిర్వహించడం ఒకవైపు అవసరమే అయినా, అంత కంటే ముఖ్యంగా మహావీరుడి బోధనలను వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవహారాలు, సామాజిక ప్రవర్తనలో ఆచరణలో పెట్టడం అవసరం. అహింసతో మాట్లాడడం, సత్యంతో నడుచుకోవడం, ఇతరుల పట్ల కరుణాభావం, అధికాసక్తి-అధికాస్థి-అధికాహంకారాలకు దూరంగా ఉండడం, ప్రకృతి మరియు ప్రతి జీవిపై బాధ్యతతో వ్యవహరించడం ద్వారా మాత్రమే మహావీర జయంతి నిజమైన అర్థాన్ని పొందుతుంది.

వర్థమాన మహావీరుడు చరిత్రలో నిలిచిపోయిన మహనీయుడు మాత్రమే కాదు; నేటి అశాంతి, అసహనం, అసమతుల్యతతో బాధపడుతున్న సమాజానికి శాశ్వత దిక్సూచి. ఆయన చిత్రపటానికి పూలు సమర్పించడం కన్నా, ఆయన బోధనలకు మన జీవితంలో స్థానం కల్పించడం గొప్ప నివాళి. శాంతి, సహనం, నైతికత, మానవత్వం, నియమశీలత మళ్లీ సమాజంలో వికసించాలంటే మహావీర మార్గమే మనకు ఆదర్శంగా నిలవాలి.

పగుడాకుల బాలస్వామి
ధర్మాచార్య సంపర్క ప్రముఖ విశ్వహిందూ పరిషత్ (తెలంగాణ)
9912975753

click here to read more devotional

click here to read భక్తిప్రభ

Leave a Reply