28marcheditorial | ఆంధ్రప్రభలో నేటి సంపాదకీయం

28marcheditorial | ఆంధ్రప్రభలో నేటి సంపాదకీయం
28marcheditorial | ట్రంప్ అత్యుత్సాహం – గల్ఫ్ యుద్ధం తీవ్ర ప్రభావం
హర్మజ్ జలసంధి – ప్రపంచ ఇంధన సరఫరాకు కీలక కేంద్రం
ఖతార్ గ్యాస్ క్షేత్రం దెబ్బతినడంతో సంక్షోభం
ఇరాన్ హెచ్చరికలు – గల్ఫ్‌లో ఉద్రిక్త పరిస్థితులు
ఇజ్రాయెల్‌పై ఒత్తిడి – యుద్ధ విస్తరణ ప్రమాదం
భారత్‌పై ప్రభావం – రూపాయి పతనం, మాంద్యం భయం
మోడీ జోక్యం అవసరం – యుద్ధ విరమణపై ప్రపంచ దృష్టి
28marcheditorial | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యుత్సాహం చివరకు సామాన్యుడి బతుకుతెరువును కూడా తీవ్రంగా దెబ్బతీస్తోంది. అంతర్జాతీయ వ్యవహారాలు, రాజ్యాధినేతల దురహంకారం ప్రపంచంలోని ఏ మారు మూల గ్రామంలోని సామాన్యుడినైనా ఎలా దెబ్బతీస్తుందో గల్ఫ్ వార్ మరోసారి నిరూపిస్తోంది. తన ఆధిపత్యం నిరూపణకు ప్రపంచ సమస్యలకు ముడిపెట్టి అనాలోచితంగా, ఏకపక్షంగా దురాక్రమణలకు పాల్పడితే ఫలితాలు ఏవిధంగా ఉంటాయో కళ్లకు కడుతోంది. ఇంధనం నేడు జన జీవితంలో నిత్యకృత్యమైంది. నీటికి ఉన్నంత ప్రాధాన్యత నేడు ఇంధనానికి కూడా ఏర్పడింది. సరఫరా గొలుసు తెగిపోతే ఏ దేశమైనా ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. గల్ఫ్ లో ముఖ్యంగా ఒకే ఒక్క హర్మజ్ జలసంధి మొత్తం ప్రపంచదేశాల ఇంధన వినియోగాన్ని ఎలా నియంత్రిస్తోందో ప్రతి ఒక్కరికీ అర్థమైంది. ఇరాన్ ఆధీనంలో నడుస్తున్న ఈ జలసంధి ద్వారా మూడో వంతుకు పైగా ఇంధన సరఫరా జరుగుతోంది.
కాని, గల్ఫ్ తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ట్రంప్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఆసియా, ఐరోపా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాదాపు నెలరోజులుగా ఇరాన్‌పై సాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడుల్లో ఇప్పటికే ఇరాన్ సర్వనాశనమైంది. ప్రతికారేచ్చతో రగిలిపోతున్న ఇరాన్ పోరాటం ఆపేది లేదంటూ, గల్ఫ్ లోని అమెరికా సైనిక స్థావరాలను దెబ్బతీస్తోంది. దీంతో సౌదీ అరేబియా, బ్రహెయిన్, కువైట్, ఒమన్ తదితర ముఖ్యమైన ఎనిమిది అరబ్ దేశాల నుంచి చమురు సరఫరాకు గండం ఏర్పడింది.
ముఖ్యంగా ఖతార్ లోని ప్రధాన గ్యాస్ క్షేత్రాన్ని దెబ్బతీయడంతో ఎల్పీజీ, ఎల్ఎన్‌జీ ఉత్పత్తి, సరఫరాలు నిలిచిపోయాయి. మొత్తం ప్రపంచ గ్యాస్ వినియోగంలో 27 శాతం ఒక్క ఖతార్ నుంచే జరగాల్సి ఉండగా, ఇప్పుడు పరిస్థితి తీవ్ర రూపం దాలుస్తోంది. ఖతార్ తిరిగి తన గ్యాస్ సరఫరాను పునరుద్ధరించడానికి కనీసం అయిదేళ్లు పడుతుందని ప్రకటించింది. మరోపక్క అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. యుద్ధం కొనసాగించాలంటే 200 బిలియన్ డాలర్లు అత్యవసరం అని పెంటగాన్ స్పష్టం చేసింది. అయినప్పటికీ, ట్రంప్ తన మంకుపట్టు వీడడం లేదు. మరో పది వేల మంది సైనికులను మోహరించి ఇరాన్ ప్రధాన చమురు క్షేత్రం ఉన్న ఖర్గే ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని అక్కడి చమురు ఉత్పత్తి, సరఫరాలను నియంత్రించాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ అదే జరిగితే ముందుగా ఇరాన్ గల్ఫ్ లోని ప్రధాన చమురు క్షేత్రాలను పేల్చేస్తామని హెచ్చరించింది. పైగా, పర్షియా వ్యాప్తంగా మైన్లను అమర్చి దెబ్బతీస్తామని తెగించి చెబుతోంది. ఇప్పటికే ఖర్గే ద్వీపం చుట్టూరా మైన్లను అమర్చినట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇంకోపక్క ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్‌కు కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. తమ సైన్యం ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉందని, ఇంటా బయటా రక్షణ కల్పించే స్థితిలో లేదని, మరింత కొనసాగిస్తే కుప్పకూలడం ఖాయం అని ఆ దేశ సైన్యాధికారి ఒకరు ఏకంగా దేశాధ్యక్షుడు నెతన్యాహును హెచ్చరించడం గమనార్హం. అగ్రరాజ్యాధినేతల దురహంకారం ఇలా ఉంటే, యుద్ధం దెబ్బకు భారత్లో మాంద్యం పొంచి ఉంది. ఇప్పటికే రూపాయి రోజురోజుకూ చిగురుటాకులా వణికిపోతూ దిగజారిపోతోంది.
తాజాగా సుమారు మారకపు విలువ 95 రూపాయిలకు పడిపోగా, 100 రూపాయిలు దాటే ప్రమాదం కనుచూపు మేరలోనే ఉంది. తక్షణం మేల్కొనకపోతే మాంద్యంలో చిక్కుకుపోవడం ఖాయం. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోడీ ప్రపంచదేశాలను కూడగట్టి, అమెరికా, ఇజ్రాయెల్‌లతో పాటు ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని నిలుపుదల చేయకపోతే పరిస్థితి మరింత దిగజారడం ఖాయం.
