బస్సు ప్రమాద బాధితులను మంత్రుల పరామర్శ..

బస్సు ప్రమాద బాధితులను మంత్రుల పరామర్శ..

ఒంగోలు రిమ్స్ లో మణెమ్మను పరామర్శించిన స్వామి, గొట్టిపాటి, ఎమ్మెల్యేలు దామచర్ల, ఇంటూరి, విజయ్ కుమార్ తదితరులు…

బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ

మణెమ్మకు ఆర్థికసహాయం అందించిన MLA నాగేశ్వరరావు

మార్కాపురం, ఆంధ్రప్రభ, : మార్కాపురం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడి, ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, దామచర్ల జనార్ధన్, బి ఎన్ విజయ్ కుమార్, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ లు శుక్రవారం పరామర్శించారు. మొత్తం 13 మంది బాధితులతో మాట్లాడి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు.

కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామానికి చెందిన బత్తుల మణెమ్మ కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతోంది. రెండు చేతులు విరిగిపోగా, లివర్ కు గాయం కావడంతో ఆపరేషన్ చేశారు. మంత్రులు సహచర ఎమ్మెల్యేలతో కలిసి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆమెను పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. మణెమ్మ భర్త వెంకటయ్యతో మాట్లాడి ఆర్థిక సహాయం అందించారు. మణెమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ బస్సు ప్రమాదంలో 14 మంది చనిపోవడం అత్యంత బాధాకరమైన సంఘటన అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడ్డవారు పూర్తిగా కోలుకునేంతవరకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇలాంటి ప్రమాదం మరోసారి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెంట అంకభూపాలపురం టిడిపి సీనియర్ నాయకులు పెగడ శ్రీనివాసులు, బండారు సోమరాజు తదితరులు ఉన్నారు.

Leave a Reply