బెల్లంపల్లిలో ఘనంగా 2కే రన్..
బెల్లంపల్లిలో ఘనంగా 2కే రన్..
అవయవ దానానికి చైర్ పర్సన్ దంపతుల అంగీకారం
నేత్ర, అవయవ దానంతోనే మరొకరికి పునర్జన్మ
ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మరణానంతరం చేసే అవయవ దానం మరొకరికి ప్రాణదానంతో సమానమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు. గురువారం బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నేత్ర, అవయవ మరియు శరీర దాన అవగాహన ర్యాలీని (2కే రన్) ఆయన జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుండి కాంటా చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో వందలాది మంది ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆదర్శంగా నిలిచిన మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ దంపతులు తమ నేత్ర, అవయవాలను దానం చేసేందుకు అంగీకార పత్రాలపై ఎమ్మెల్యే సమక్షంలో సంతకం చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు అపోహలు వీడి అవయవ దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చైర్ పర్సన్ దంపతుల నిర్ణయాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
సామాజిక బాధ్యతగా అవయవ దానం
చైర్ పర్సన్ దావ స్వాతి మాట్లాడుతూ.. మనిషి మరణించినా అవయవాల రూపంలో జీవించే అవకాశం ఉందని, ఇటీవలి కాలంలో బెల్లంపల్లిలో బింగి అశోక్ కుమార్, కొట్టే సత్యప్రకాష్, లింగంపల్లి వర్శిత, ఆయిల్ల మల్లేష్ కుటుంబ సభ్యులు చూపిన స్ఫూర్తి అభినందనీయమన్నారు. సదశయా ఫౌండేషన్ కార్యదర్శి లింగమూర్తి మాట్లాడుతూ.. ఒక వ్యక్తి అవయవ దానం ద్వారా ఆరుగురికి ప్రాణభిక్ష పెట్టవచ్చని వివరించారు. జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు తమ సంస్థ ద్వారా 13 నేత్రదానాలు పూర్తి చేశామన్నారు. ఈ నెల 29న (ఆదివారం) తాపీ మేస్త్రీల సంఘ భవనంలో అవయవ దాన అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రవి కుమార్, వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
