26marchchintana | రాగద్వేషాలు అంటే..? మనశ్శాంతికి మార్గం ఏమిటి?

26marchchintana | రాగద్వేషాలు అంటే..? మనశ్శాంతికి మార్గం ఏమిటి?
26marchchintana రాగద్వేషాల అర్థం, కారణాలు
మనస్సుపై ప్రభావం
నియంత్రణకు యోగ, వేదాంత మార్గాలు
ఆచరణలో రాగద్వేషాల ప్రభావం
మనశ్శాంతి కోసం సాధన
26marchchintana ‘రాగద్వేషాలు’ అనేది భారతీయ తత్వశాస్త్రంలో, ముఖ్యంగా వేదాంతం, యోగశాస్త్రంలో తరచుగా వినిపించే పదం. మన మనస్సులోని అశాంతికి, బంధాలకు ఈ రెండే ప్రధాన కారణాలుని పెద్దలు చెబుతుంటారు. రాగము అంటే ఒక వస్తువుపై, వ్యక్తిపై లేదా పరిస్థితిపై కలిగే అతిశయమైన ఇష్టం, వ్యామోహం. ఏదైనా మనకు సుఖాన్ని ఇస్తుందని భావించినప్పుడు దానిని పట్టుకుని ఉండాలనుకోవడమే రాగము. ఇది దొరకనప్పుడు లేదా దూరమైనప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. ద్వేషము అంటే ఒక వస్తువు పట్ల లేదా వ్యక్తి పట్ల కలిగే అసహ్యం, అతిశయమైన అయిష్టం. ఏదైనా మనకు కష్టాన్ని, భయాన్ని కలిగిస్తుందని భావించినప్పుడు దానిని దూరం పెట్టాలనుకోవడమే ద్వేషము. నచ్చని విషయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనసులో కోపం, అసహనం కలుగుతాయి. మనుషులు సాధారణంగా తమకు నచ్చిన వాటిని (రాగము) వెంటాడుతూ, నచ్చని వాటిని (ద్వేషము) తప్పించుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంటారు. ఇష్టమైనవి పోతాయేమో అన్న భయం, ఇష్టం లేనివి వస్తాయేమో అన్న ఆందోళన నిరంతరం వెంటాడతాయి. రాగద్వేషాలతో నిండిన మనస్సు ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడలేదు. పక్షపాతంతో ఆలోచిస్తుంది. గీతాచార్యుడు చెప్పినట్లు, రాగద్వేషాలకు అతీతంగా ఉన్నవాడే స్థితప్రజ్ఞుడు. ఇవి లేనప్పుడే మనిషికి నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది.

“సుఖానుశయీ రాగః.. దుఃఖానుశయీ ద్వేషః ” (సుఖాన్ని ఇచ్చే దాని వెంట రాగము, దుఃఖాన్ని ఇచ్చే దాని వెంట ద్వేషము ఉంటాయి – పతంజలి యోగ సూత్రాలు). రాగద్వేషాలను పూర్తిగా వదలడం సామాన్యులకు కష్టం కావచ్చు, కానీ వాటిని నియంత్రించడం ద్వారా ప్రశాంతమైన జీవితం గడపవచ్చు. రాగద్వేషాలను నియంత్రించడం అంటే మన భావాలను చంపుకోవడం కాదు, వాటికి అతీతంగా ఉండటం. మనసు ఒక అద్దం వంటిది. అద్దం మీద దుమ్ము పేరుకుపోయినప్పుడు, అది వస్తువులను ఉన్నది ఉన్నట్లుగా చూపించదు. ‘రాగము’ అనే దుమ్ము కమ్మేస్తే వస్తువు ఉన్నదానికంటే అందంగా, సుఖదాయకంగా కనిపిస్తుంది. ‘ద్వేషము’ అనే దుమ్ము కమ్మేస్తే వస్తువు భయంకరంగా, హానికరంగా కనిపిస్తుంది. ఈ రాగ ద్వేషాల వల్ల మనసు ఎప్పుడూ అలజడికి లోనవుతూనే ఉంటుంది. అందుకే వేదాంతశాస్త్రంలో “మన ఏవ మనుష్యాణాం కారణం బంధమో క్షయోః” అని చెప్పారు. అంటే మనిషి రాగద్వేషాలకి, మోక్షానికి మనసే కారణం. వీటిని అదుపులో ఉంచుకోవడానికి మన ప్రాచీన గ్రంథాలు, మనస్తత్వ శాస్త్రం కొన్ని ఆచరణాత్మక మార్గాలను సూచిస్తున్నాయి.
మనసు కారణం కాబట్టి, పరిష్కారం కూడా మనసుతోనే మొదలవ్వాలి. “ఇది కేవలం మనసు సృష్టిస్తున్న భ్రమ మాత్రమే, వస్తువులో సుఖదుఃఖాలు లేవు” అని పదే పదే మనసుకు నచ్చజెప్పాలి. మనసులో ఆలోచనలు వస్తున్నప్పుడు, వాటితోపాటు కొట్టుకుపోకుండా ఒడ్డున నిలబడి చూస్తున్నట్లు (సాక్షి భావం) గమనించాలి. మనసుకు, శ్వాసకు దగ్గరి సంబంధం ఉంటుంది. శ్వాసను నియంత్రించడం ద్వారా మనసులోని రాగద్వేషాల వేగాన్ని తగ్గించవచ్చు. బయట ప్రపంచంలో ఏదీ మనల్ని ఇబ్బంది పెట్టదు. ఒక వ్యక్తిని చూసి మనం కోపగించుకున్నామంటే, ఆ కోపం ఆ వ్యక్తిలో లేదు, మన మనసులో ఆ వ్యక్తి పట్ల ఉన్న ‘ద్వేషం’ అనే ముద్రలో ఉంది. మనసును ఈ ముద్రల నుండి శుభ్రం చేయడమే అసలైన యోగం. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. మనకు ఇష్టమైన వ్యక్తి అయినా, వస్తువు అయినా ఏదో ఒక రోజు దూరమవ్వాల్సిందే. అలాగే మనం ద్వేషించే పరిస్థితి కూడా ఎల్లకాలం ఉండదు. “ఇది కూడా గడిచిపోతుంది” అనే సత్యాన్ని మననం చేసుకోవడం వల్ల రాగద్వేషాల పట్టు సడలుతుంది.
చాలా వరకు రాగద్వేషాలు ఫలితం మీద ఆధారపడి ఉంటాయి. కేవలం పనిమీద దృష్టి పెట్టి, ఫలితాన్ని స్వీకరించే గుణాన్ని అలవరుచుకుంటే మనశ్శాంతి లభిస్తుంది. ఒక విషయంపట్ల ఆకర్షితులైనప్పుడు.. “ఇది నాకు నిజంగా అవసరమా? దీని వల్ల కలిగే సుఖం ఎంతకాలం ఉంటుంది?” అని విశ్లేషించుకోవాలి. అలాగే ఒకరి మీద ద్వేషం కలిగినప్పుడు.. “ఈ ద్వేషంవల్ల నాకే కదా నష్టం, నా మనసే కదా పాడవుతోంది” అని ఆలోచించడంవల్ల విచక్షణ పెరుగుతుంది. రాగద్వేషాలు ఒకే రోజులో మాయం కావు. ఇది ఒక నిరంతర సాధన. రోజూ కొద్దిసేపు ధ్యానం చేయడంవల్ల మన ఆలోచనల మీద మనకు పట్టు దొరుకుతుంది.
భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు: “అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే”. మనసును పదే పదే ప్రశాంతతవైపు మళ్లించడం. అనవసరమైన విషయాల పట్ల మక్కువను వదులుకోవడం ముఖ్యం. యజమాని లేదా సహోద్యోగి ఎప్పుడూ పొగుడుతుంటే, వారిపై ‘రాగం’ అపరిమితమైన ఇష్టం ఏర్పడుతుంది. పొరపాటున వారు విమర్శిస్తే, తట్టుకోలేరు. అది తీవ్రమైన బాధకు దారితీస్తుంది.
ఒక సహోద్యోగి నచ్చని పని చేసినప్పుడు, అతనిపై ‘ద్వేషం’ పెంచుకుంటారు. దీనివల్ల అతను ఏదైనా మంచి సలహా ఇచ్చినా స్వీకరించడు. ఇది వృత్తిపరమైన ఎదుగుదలను దెబ్బతీస్తుంది. పిల్లలు లేదా మనకు అత్యంత ఇష్టమైన వారు మనం చెప్పినట్లే వినాలని కోరు కోవడం, వారు భిన్నంగా ప్రవర్తిస్తే తీవ్రమైన మానసిక వేదనకు గురవ్వడం, గతంలో ఎవరో అన్న మాటను గుర్తు పెట్టుకుని, వారిని కలిసిన ప్రతిసారీ లోపల మంట పుట్టడం, ఆ ద్వేషం వల్ల ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించలేకపోవడం వంటివి రాగద్వేషాల ప్రభావమే. ఆత్మ మేలిమి బంగారంలాంటిది.
అది ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది. కానీ బంగారానికి ఎలా మకిలి పడుతుందో అలా మన మనసు, బుద్ధి రాగద్వేషాలలో చిక్కుకుని మన ఆత్మ సాక్షాత్కారం కాకుండా చేస్తాయి. మనసును రాగద్వేషాలు అనే మకిలి నుంచి శుద్ధి చేసుకుంటే ఆత్మ అనే బంగారాన్ని సాక్షాత్కారం చేసుకోవచ్చు. కానీ ఇది చాలా కష్ట సాధ్యం. భగవంతుని కరుణతో ఇది సాధ్యపడుతుంది. అందుకే భగవత్ చింతన మొదలుపెట్టాలి.
ఆనంద మైత్రేయమ్
8008577834
