ఇది ప్రజాపాలన కాదు.. ప్రజావ్యతిరేక పాలన..

ఇది ప్రజాపాలన కాదు.. ప్రజావ్యతిరేక పాలన..
ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే నీరుగారిస్తుందని బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ శ్రీనివాసాచారి, భద్రాద్రి జిల్లా నాయకులు సిరినోముల వజ్రేశ్వరరావు అన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలకు రైతుల సమస్యలకు బీజేపీ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో వారిని ముందస్తు అరెస్టులు చేయడం పిరికిపంథా చర్య అన్నారు. అసెంబ్లీ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతున్నప్పటికి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడిచినా మేనిఫెస్టోలో పొందుపరిచిన వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచలేదని.. వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు.
ప్రధానంగా వారికి స్కూటీ అందజేస్తామని చెప్పి విస్మరించారని, స్వయం ఉపాధి కింద ఇస్తున్న రూ.50 వేల ఋణం ఏమాత్రం సరిపోవడం లేదని, దీన్ని 5 లక్షలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా రైతుబంధు రైతులకు రెండుమార్లు ఎగ్గొట్టినప్పటికీ, రైతులకు 05 నుండి 10 ఎకరాల భూమి కలిగి ఉన్నప్పటికీ కేవలం 6000 రూపాయలకే పరిమితమైందని, కౌలు రైతులు 12 వేల రూపాయలతో తుడిచిపెట్టుకుందని, మహిళలకు 2500 రూపాయలు ఇవ్వాలనేది ప్రభుత్వ మదిలోనే లేదని, తులం బంగారాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం అసాధ్యమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, దివ్యాంగుల సమస్యలకు మద్దతు తెలిపిన వారిని అరెస్టుల పేరిట భయభ్రాంతులకు గురి చేయడం.. కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారిందని ఆరోపించారు. ఇప్పటికైనా రైతులు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించే వరకు బీజేపీ పార్టీ పోరాటం ఆగదని శ్రీనివాసాచారి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి పూనెం రాంబాబు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
