వ్యవసాయ మార్కెట్ ల అభివృద్ధికి నిధులు కేటాయించాలి

వ్యవసాయ మార్కెట్ ల అభివృద్ధికి నిధులు కేటాయించాలి

మంత్రిని కోరిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు,ఆంధ్రప్రభ : నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కోరారు.ఈ మేరకు హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో తొర్రూరు, పాలకుర్తి,కొడకండ్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లతో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.


పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చి,విజ్ఞప్తులతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్లలో సరైన మౌలిక వసతుల లేమి, నిల్వ సదుపాయాల కొరత, రైతులు పంటలను అమ్ముకునే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.


తొర్రూరు, కొడకండ్ల, పాలకుర్తి ప్రాంతాల్లోని వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, మార్కెట్ల అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్‌లు అనుమాండ్ల తిరుపతి రెడ్డి,నల్ల అండాలు,లావుడియా మంజుల భాస్కర్,వైస్ చైర్మన్ లు బట్టు నాయక్, మల్లారెడ్డి, సాయి కృష్ణ లు పాల్గొన్నారు.