చౌటుప్పల్‌లో పన్నుల వసూళ్ల ముమ్మరం..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూలు ప్రక్రియను ముమ్మరం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. కలెక్షన్ లక్ష్యాన్ని సకాలంలో చేరుకోవాలనే ఉద్దేశంతో పట్టణంలోని పలు వార్డుల్లో పన్నులు చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, మొండి బకాయిదారుల ఆస్తులను సీజ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పట్టణ ప్రజలు తమకు సంబంధించిన ఆస్తి పన్ను, నీటి పన్ను, వ్యాపార పన్నులను ఈ నెల 31వ తేదీ గడువులోగా తప్పనిసరిగా చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించినప్పుడే కేంద్ర ప్రభుత్వం నుండి లభించే 15వ ఆర్థిక సంఘం నిధులు మున్సిపాలిటీకి అందుతాయని, లేనిపక్షంలో ఆ నిధులు నిలిచిపోయే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి బాధ్యతగా పన్నులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవిన్యూ ఆఫీసర్ అంజయ్య మాట్లాడుతూ పన్నుల వసూళ్లలో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు.