నర్సంపేట పెళ్లి వేడుకలో భావోద్వేగ క్షణాలు

నర్సంపేట పెళ్లి వేడుకలో భావోద్వేగ క్షణాలు
- సమాజానికి మానవీయ సందేశం
- కొడుకును కౌగిలించుకుని తండ్రి కన్నీళ్లు
- హృదయాలను కదిలించిన అరుదైన దృశ్యం
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : పెళ్లి అంటే ఆనందాల పండుగ, కొత్త బంధాల ఆరంభం. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో నవ్వులు, ఆశీర్వాదాలతో నిండే వేడుక. అయితే నర్సంపేట రూరల్ ప్రాంతంలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో కనిపించిన అరుదైన దృశ్యం అందరి హృదయాలను కదిలించింది.
పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత అత్తారింటికి వెళ్లే సందర్భంలో సాధారణంగా పెళ్లికూతురు ఇంటివారే భావోద్వేగానికి లోనవుతారు. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా కనిపించింది. పెళ్లికొడుకు తండ్రి తన కొడుకును కౌగలించుకుని బోరున విలపించడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.
“నాయనా… నాకు ఆడపిల్లలు లేరు, నువ్వొక్కడివే… నన్ను మరిచిపోకు” అంటూ తండ్రి చిన్నపిల్లాడిలా ఏడవడం ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంది. కొడుకును వదలలేక మళ్లీ మళ్లీ కౌగలించుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యం చూసి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే కాకుండా పెళ్లికూతురు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సంఘటన సమాజానికి ఒక మానవీయ సందేశాన్ని అందిస్తోంది. కూతురైనా, కొడుకైనా తల్లిదండ్రుల ప్రేమ ఒకటేనని, కన్నపేగు బంధానికి లింగభేదం ఉండదని స్పష్టం చేస్తోంది. కాలం మారుతున్న కొద్దీ పిల్లలు తమ జీవితాలతో బిజీ అవుతూ తల్లిదండ్రులకు దూరమవుతున్నారనే వాస్తవాన్ని కూడా ఇది గుర్తుచేస్తోంది.
పిల్లలను ప్రేమతో పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేయకూడదని, వారికి తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సంఘటన తెలియజేస్తోంది. నూతన దంపతులు ఇరు కుటుంబాలను సమానంగా గౌరవిస్తూ, తల్లిదండ్రులను మించిన దైవం లేదని గుర్తుంచుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు. ఈ సంఘటన ఒక కుటుంబానికి మాత్రమే సంబంధించినది కాదు… ప్రతి మనసును తాకే జీవన సత్యంగా నిలిచింది.
