ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయ వద్ద ఉద్రిక్తత..
- భద్రకాళి ఆలయంలో రాజకీయాలు తగవు: గంట రవికుమార్
ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ బ్యూరో: లక్షలాది మంది భక్తుల విశ్వాసాలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దెబ్బతీస్తున్నాయని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆరోపించారు. ఓరుగల్లు ప్రజల ఆరాధ్య దైవమైన భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చడం సరికాదని అన్నారు.
శనివారం భద్రకాళి ఆలయ పరిసరాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పసుపు నీళ్లు, గంగా, గోదావరి జలాలతో సంప్రోక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను విక్రయిస్తూ, ఆలయాల్లో రాజకీయ డ్రామాలు ఆడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరు సిగ్గుచేటని విమర్శించారు.

దేవాదాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే దేవాలయాల పవిత్రత దెబ్బతినడం బాధాకరమన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వరంగల్ అభివృద్ధి జరగలేదని, కుడా పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములను విక్రయిస్తూ ఇరు పార్టీల నేతలు అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, ప్రస్తుత కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి తడిబట్టలతో ఆలయంలోకి ప్రవేశించి ప్రమాణాలు చేయడం ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు. వారి చర్యల వల్ల ఆలయ పవిత్రత దెబ్బతిందని, అందుకే ఆలయ సంప్రోక్షణ చేపట్టామని తెలిపారు.

అవినీతి ఆరోపణలు ఉంటే విచారణ సంస్థల ఎదుట లేదా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, పవిత్ర దేవాలయాలను రాజకీయ వివాదాలకు వేదికగా మార్చడం సరికాదని పేర్కొన్నారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన చర్యలపై దేవస్థానం అధికారులు స్పందించకపోవడం విచారకరమన్నారు.
ఆలయ పవిత్రతను భ్రష్టు పట్టించినందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు భక్తులకు, హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయాల గేటు వెలుపల రాజకీయ కార్యక్రమాలు నిర్వహించవచ్చని, గర్భాలయం, ఆలయ పరిసరాల్లో రాజకీయాలు చేయడం తగదన్నారు.

వరంగల్ నగరంలో శాంతిభద్రతలు పరిరక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ఆలయం వద్ద జరిగిన పరిణామాలను అడ్డుకోలేదని విమర్శించారు.
ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంట రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మట్టేవాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి సహా బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
