స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు
ఎ.కొండూరు మార్కెట్ యార్డులో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు
నిరుద్యోగ యువతకు వరం
ఎ.కొండూరు మార్కెట్ యార్డ్ గోడౌన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశా
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టిందని,ఇందులో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ ఎ.కొండూరు మండలం చైతన్య నగర్ సమీపంలో ఉన్న అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ( ఏఎంసి మార్కెట్ యార్డ్)ను సందర్శించి గోడౌన్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలను వినియోగించుకుని, త్వరలోనే ఒక భారీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (నైపుణ్యాభివృద్ధి కేంద్రం) ప్రారంభించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మార్కెట్ యార్డులో ఖాళీగా ఉన్న గోడౌన్లు శిక్షణ తరగతులు నిర్వహించడానికి, ల్యాబ్ల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గోడౌన్ల ప్రస్తుత పరిస్థితిని, మౌలిక సదుపాయాలను కలెక్టర్ సమీక్షించారు. యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, మార్కెట్ యార్డ్ సిబ్బంది, స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే తిరువూరు పరిసర ప్రాంతాల్లోని వందలాది మంది యువతకు నైపుణ్య శిక్షణ లభించి, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ శావల దేవదత్, తహసీల్దార్ ఎన్. అరవింద్,గిరిజన రాష్ట్ర నాయకులు బి. గోపిరాజు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
