మత సామరస్యానికి ప్రతీక ఈద్ ఉల్ ఫితర్…

మత సామరస్యానికి ప్రతీక ఈద్ ఉల్ ఫితర్…

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మత సామరస్యానికి, సోదర భావానికి ఈద్-ఉల్-ఫితర్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని బీహార్ రాష్ట్రానికి చెందిన ఖురానే హాఫీజ్ షానూర్ ఆలం ఉద్బోధించారు. ఎ.కొండూరు మండలంలోని చీమలపాడు, కృష్ణారావు పాలెం, ఎ.కొండూరు, రామచంద్రాపురం, కంభంపాడు, కోడూరు, గొల్లమందల, రేపూడి గ్రామాల్లోని ముస్లిం సోదరులు ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఉదయాన్నే పిల్లలు పెద్దలు తలంటు స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి, గ్రామాలకు దగ్గరలో ఉన్న ఈద్గాలు, మసీదులకు వెళ్లి ఆయా గ్రామాల పేష్ ఇమామ్ ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చీమలపాడు ఈద్గాహ్ వద్ద ప్రార్థన అనంతరం మత గురువు షానూర్ ఆలం మాట్లాడుతూ సర్వ మానవ సమానత్వాన్ని, ప్రేమాభిమానాలను పెంపొందించేదే రంజాన్ అన్నారు.

ఈ మాసంలో ధనిక పేద తేడా లేకుండా రాగద్వేషాలు విడిచి సోదర భావంతో మెలగాలన్నారు. ఇస్లాం సర్వ మానవాళికి నూతన మార్గాన్ని, జీవన విధానాన్ని సూచిస్తుం దన్నారు. సర్వ మానవాళికి ముక్తి మార్గాన్ని చూపించేందుకు దైవం పంపిన ఖురాన్ షరీఫ్ గ్రంథం ఈ మాసంలోనే అవతరించిందన్నారు. ప్రపంచంలో ఎన్ని జాతులు మతాలు ఉన్నప్పటికీ అందరూ సోదరాభావంతో మెలిగే ఏకైక దేశం మనదేనన్నారు. రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నం అన్నారు.

క్రమశిక్షణ, ధాతృత్వం, ధార్మిక చింతనల కలయకే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. పేదలకు దానం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుందన్నారు. పేదల ఆకలి దప్పికలు సర్వ మానవాళికి తెలియజేయాలన్నదే రంజాన్ పర్వదినం ఉద్దేశం అన్నారు. ఖురాన్ షరీఫ్ బోధించిన ఉత్తమ జీవన సరళిని అనుసరిస్తూ పరమత సహనాన్ని కలిగి ఉండాలన్నారు. ఉపవాస దీక్షలు ఆకలి గొప్పతనాన్ని తెలియజేస్తాయని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టటం కష్టాల్లో ఉన్న వారికి తోచిన విధంగా సహాయం చేయాలన్నారు.

ఈ మాసంలో ప్రతి దీక్షపరుడు దానధర్మాలకు పెద్దపీట వేయాలన్నారు.నెల రోజులపాటు ముస్లిం సోదరులు కఠోర ఉపవాస దీక్షలతో నిష్టగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగించారన్నారు. ప్రతి ఒక్కరూ అల్లా కరుణ కటాక్షాలు పొందాలని లక్ష్యంతో రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ బీద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ తమకు ఉన్నదానిలో దానధర్మాలు చేస్తూ సేవా దృక్పథానికి,సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు.

అల్లా ఇచ్చిన జీవితాన్ని పరమ పవిత్రంగా నిష్టగా గడుపుతూ పెద్దలు తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలన్నారు. ప్రవక్త బోధించిన బోధనలను తూచ తప్పకుండా పాటిస్తూ ఇస్లాం ధర్మాలను ఆచరిస్తూ దానధర్మాలు చేస్తూ పేదలను ఆదుకోవాలని కోరారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని హిందూ ముస్లిం, క్రైస్తవ సోదరులు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ సందర్భంగా ఈద్గాహ్ వద్ద ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా స్థానిక ఎస్ ఐ గంధం మహా లక్ష్మణుడు ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో మదీనా మస్జిద్ ముతవల్లి ఖాదర్ మొహిద్దీన్, ఏ ఏ ఎం టి కే దర్గా అండ్ దర్బార్ పీఠాధిపతి, సజ్దాదా నషీన్, పీర్జాద మొహమ్మద్ ఖాజా మొహిద్దీన్, ప్రముఖ జర్నలిస్ట్ ఎండి గౌస్ (శాతవాహన) ప్రముఖ వాస్తుశిల్పి జాఫర్ సాధిక్, తాజ్ ఖాదర్ బాబు, ఖాజా మొహిద్దీన్, కరీముల్లా, ఖాదర్ బాబు, తాజుద్దీన్, ఖాదర్ ఖాన్, జాఫర్, మౌజన్ ఎండి.ఇస్మాయిల్, సందాని, మగ్బుల్, బషీర్, కరీముల్లా, అబ్దుల్ ఖాదర్, షౌకత్, అక్బర్, షాజు, జాఫర్, సయీద్, షఫీ, అమీన్ సాహెబ్, చిన్న జానీ, మహబూబ్ సుభాని, హుస్సేన్ బాబు, మాస్టర్ జాఫర్, సుభాని, షేక్ సుభాని, యాసీన్, తదితర ముస్లింయంగ్ కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అనంతరం బంధుమిత్రులకు సేమ్యాలతో చేసిన ప్రత్యేక వంటకాలను పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.