వెల్దండలో అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష..

వెల్దండలో అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష..
వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండలసమీపంలోని చొక్కానపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సాగు చేస్తున్న మునగ తోటను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జి.వి. శ్యాం ప్రసాద్ లాల్ శుక్రవారం పరిశీలించారు. తోట నిర్వహణ, మొక్కల పెరుగుదల, నీటి వినియోగం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి, రైతులకు మరింత సాంకేతిక మార్గదర్శకత అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం బొల్లంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన క్యాటిల్ షెడ్‌ను సందర్శించి, పశుసంవర్థక కార్యకలాపాలకు ఇది ఉపయోగకరంగా ఉండేలా నిర్వహణపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
అలాగే గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, పనుల నాణ్యతను కాపాడుతూ, నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గుండాల గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన సామూహిక మరుగుదొడ్ల సముదాయమునును పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పనుల్లో పారదర్శకత, నాణ్యత, సమయపాలన పాటించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ, ఎంపీడీవో, ఎంపీవో, ఈసీ, టిఏలు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
