అవుట్‌డోర్ స్టేడియం అభివృద్ధికి శంకుస్థాపన

అవుట్‌డోర్ స్టేడియం అభివృద్ధికి శంకుస్థాపన
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : క్రీడాకారులు, వాకర్స్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ తెలిపారు. గురువారం సాయంత్రం స్టేడియంలో పికిల్ బాల్ కోర్టులు, వాలీబాల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్‌లకు సంబంధించి సుమారు రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి సింథటిక్ ఫ్లోరింగ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తాను గతంలో ఇదే స్టేడియంలో క్రీడలు ఆడిన అనుభవం ఉందని, క్రీడల అభివృద్ధికి తమ కుటుంబం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు. చేపడుతున్న పనులు మూడు నెలల్లో పూర్తిచేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. యువతను భవిష్యత్ ఛాంపియన్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.
గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి మందగించినట్లు పేర్కొన్న మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమవుతోందన్నారు. టిడ్కో గృహ సముదాయం సమీపంలో గ్రీన్కో సంస్థ నిర్మిస్తున్న స్టేడియం త్వరలో పూర్తవుతుందని, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద మరో స్టేడియం అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాలకు పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని సహకారం అందిస్తున్నారని తెలిపారు.
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణంపై వస్తున్న అపోహలను ప్రజలు నమ్మవద్దని, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రజల భవిష్యత్తు సురక్షితంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్టేడియాన్ని ఆకుపచ్చగా మార్చేందుకు తన ఎంపీ నిధుల నుంచి రూ.15 లక్షలు కేటాయిస్తానని ప్రకటించారు.
కర్నూలు సి-క్యాంపులోని 67 ఎకరాల భూమిలో 10 ఎకరాలు హైకోర్టు బెంచ్‌కు కేటాయించినట్లు, మిగిలిన భూమిలో కలెక్టర్ కార్యాలయం, పార్క్ ,ఇతర అభివృద్ధి పనులకు అనుమతులు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో పెద్ద కంపెనీలను తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మంత్రి భరత్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ నగర అభివృద్ధికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్డీవో భూపతిరావు, హజ్ కమిటీ సభ్యుడు మన్సూర్ అలీ ఖాన్, ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ కౌశిక్, నాయకులు, స్టేడియం సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
