ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించండి…

ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించండి…
పర్యావరణాన్ని కాపాడడం మనందరి బాధ్యత
ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని 80 అడుగుల రోడ్డులో పీడియాట్రిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిక్కోలు సంత కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరై సంతను ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు, వైద్యులు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాలో మొదటిసారిగా ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు నేరుగా అందించే వారపు సంతను ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు. తూర్పు కనుమల ప్రాంతాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు పండించిన వరి, పండ్లు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, కూరగాయలు, అలాగే విలువ ఆధారిత ఉత్పత్తులు, గానుగ నూనెలు వంటి సహజ, సేంద్రియ ఉత్పత్తులను ఈ సంత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారని చెప్పారు.
ఇలాంటి సంతల ద్వారా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం లభిస్తుందని, దీంతో రైతులకు మంచి ఆదాయం కూడా కలుగుతుందని ఆయన అన్నారు. మధ్యవర్తులు లేకుండా రైతులు నేరుగా ప్రజలకు ఉత్పత్తులను అందించడం ద్వారా రైతులకు లాభం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో రసాయనాలు లేని సహజ ఆహార పదార్థాల వినియోగం చాలా అవసరమని ఎమ్మెల్యే చెప్పారు. ఆహారమే ఆరోగ్యం అనే సిద్ధాంతంతో ఈ సిక్కోలు సంత కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
సహజ వ్యవసాయం ద్వారా పండించిన ఆహార పదార్థాలు మన ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా భూమి ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయని చెప్పారు.ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించవచ్చని, భవిష్యత్ తరాలకు మంచి ప్రకృతిని అందించవచ్చని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మరింతగా ముందుకు రావాలని, ప్రజలు కూడా సేంద్రియ ఉత్పత్తులను వినియోగించి రైతులకు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి సంతలు జిల్లాలో మరిన్ని చోట్ల ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ప్రజల ఆరోగ్యం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో ఒక మంచి ఆరంభమని తెలిపారు.
