జిల్లాలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు

జిల్లాలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు
- డిమాండ్ కు అనుగుణంగా లభ్యత
- తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు
- జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దు
- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ అర్బన్, ఆంధ్రప్రభ: జనగామ జిల్లాలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు అని డిమాండ్ కు అనుగుణంగా లభ్యత కలదని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.శనివారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, సంబంధిత అధికారులతో కలిసి గ్యాస్ సరఫరాపై జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కమిటీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 12 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో లక్షా అరవై వేల గ్యాస్ కనెక్షన్లు కలవని, డిమాండ్ కు అనుగుణంగా సంబంధిత ఏజెన్సీల వద్ద వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలిండర్లు నిల్వలో సిద్ధంగా ఉన్నాయన్నారు.
]అనవసరంగా ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ప్రజలెవరూ కూడా ఆందోళన చెందవద్దు అని, డిమాండ్ కు అనుగుణంగా గ్యాస్ లభ్యత ఉందని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పౌరసరఫరాల విజిలెన్స్ కమిటీ సభ్యులు నిత్యం గ్యాస్ డీలర్ల వద్ద ఉన్న నిల్వలను గమనిస్తూ ఉండాలని, వినియోగదారులతో పాటు ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
హోటళ్ళు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్ మాత్రమే ఉపయోగించాలని, డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ సూచనల ప్రకారం అర్బన్ ప్రాంతాల్లో 25 రోజుల వ్యవధి, అలాగే రూరల్ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధి అనంతరం మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని వివరించారు. అదే విధంగా అక్రమ గ్యాస్ తరలింపుపై సమాచారం అందించేందుకు గాను కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్యాస్ డెలివరీ చేసే సమయంలో డెలివరీ బాయ్ కి ఓటీపీ చెప్పి సహకరించాలని, వారి విధులకు ఎవరైనా ఆటంకం కలిగించినట్లయితే, అలాంటి వినియోగదారులపైన కూడా చట్టపరంగా చర్యలు తప్పవన్నారు.
ఎల్పీజీ వినియోగదారులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలని, గ్యాస్ ఏజెన్సీల వద్ద, ఆన్లైన్లో కానీ గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ లో గ్యాస్ సిలిండర్ పంపిణీ సమయంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల వద్ద కేవైసీ పూర్తి చేసుకోవచ్చని సూచించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని, సోషల్ మీడియా, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వార్తలను నమ్మవద్దని తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, జిల్లా పౌరసరఫరాల అధికారి సరస్వతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు రవీందర్, హసీనా బేగం, విక్రమ్, డీఏఓ అంబికా సోనీ, డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, డీడబ్ల్యూఓ కోదండరాములు, సంబంధిత అధికారులు, గ్యాస్ డీలర్ల సంఘం ప్రెసిడెంట్, సభ్యులు, డిస్ట్రిబ్యూటర్ లు, తదితరులు పాల్గొన్నారు.
