Meeting | కేంద్రమంత్రిని కలిసిన మంత్రి సీతక్క

Meeting | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లాను ఎంపిక చేశారు. ములుగు జిల్లాను ఎంపిక చేయడం పట్ల తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని శనివారం ఢిల్లీలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ములుగు జిల్లాలో మహిళలు, బాలికల భద్రత, గౌరవం, రాకపోకల సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు జెండర్-రెస్పాన్సివ్ మౌలిక సదుపాయాలు, మెరుగైన నిఘా వ్యవస్థలు, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. ములుగులో ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీలో.. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ.. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పూర్తి సహకారాన్ని అందిస్తుందని కేంద్రమంత్రికి సీతక్క చెప్పారు.

మహిళా సాధికారత, భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవను అభినందిస్తూ.. తెలంగాణలో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల రక్షణను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి సీతక్క స్పష్టం చేశారు. క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలి: మంత్రి సీతక్క విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాలనా – మిషన్ శక్తి) పథకం కింద పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల గౌరవ వేతనాలను పెంచాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం క్రెచ్ వర్కర్లకు నెలకు రూ. 5,500, హెల్పర్లకు రూ. 3,000 మాత్రమే గౌరవ వేతనంగా ఇస్తున్నారని.. ఇది వారు చేసే పనికి, బాధ్యతకు ఏమాత్రం సరిపోదని మంత్రి సీతక్క కేంద్రమంత్రికి వివరించారు. ఒక క్రెచ్‌లో దాదాపు 25 మంది పిల్లల సంరక్షణను చూడటం ఎంతో బాధ్యతతో కూడుకున్న పని అని.. ప్రస్తుత జీవన ప్రమాణాల దృష్ట్యా ఈ వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని మంత్రి సీతక్క వివరించారు.

తక్కువ వేతనాల వల్ల నిపుణులైన సిబ్బందిని ఈ పథకంలో కొనసాగించడం కష్టమవుతోందని.. ఇది పరోక్షంగా శిశు సంరక్షణపై ప్రభావం చూపుతుందన్నారు. పనిచేసే తల్లులకు అండగా నిలిచే ఈ పథకం విజయవంతం కావాలంటే.. సిబ్బందికి ఇచ్చే వేతనాలను ప్రస్తుత వేతన ప్రమాణాలకు అనుగుణంగా పెంచాలని మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారత, శిశు సంక్షేమం కోసం పనిచేస్తున్న సిబ్బంది ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కేంద్రం ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు.

Leave a Reply