సమాజ సేవలో పద్మశాలి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భాగస్వామ్యం కావాలి
కరీమాబాద్, ఆంధ్రప్రభ : సమాజ సేవా కార్యక్రమాల్లో తెలంగాణ పద్మశాలి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు భాగస్వాములు కావాలని సంఘం అధ్యక్షుడు బిట్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గుండు కామేశ్వర్ రావు పిలుపునిచ్చారు.
తెలంగాణ పద్మశాలి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం హంటర్ రోడ్డులోని పద్మశాలి నేత హాస్టల్‌లో సంఘం అధ్యక్షుడు బిట్ల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన ప్రధాన కార్యదర్శిగా గుండు కామేశ్వర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు.
సమావేశంలో పలు ముఖ్య తీర్మానాలు చేశారు. ప్రతి నెల కార్యవర్గ సమావేశం నిర్వహించడంతో పాటు, ఆరు నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సంఘ అభివృద్ధి నిధి ఏర్పాటు చేయాలని, అందుకు కార్యవర్గ సభ్యులు ఒక్కొక్కరు రూ.1000 చొప్పున చెల్లించాలని తీర్మానించారు.
అభివృద్ధి నిధితో టీపీఆర్‌యూఎస్ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే రాచర్ల శంకరయ్యను ముఖ్య సలహాదారుగా, బింగి వెంకటనారాయణను లీగల్ సలహాదారుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో కోశాధికారి పి. సోమయ్యతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
